
వంశీకృష్ణ పగటి కలలు మానుకో..
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు
కొమ్మాది: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గెలుస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ పగటి కలలు కంటున్నాడని, అది మానుకుంటే మంచిదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు అన్నారు. ఎండాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ భవిష్యత్‌నిచ్చిన వైఎస్సార్ సీపీని వీడి వంశీకృష్ణ చాలా తప్పు చేశాడని, ఆయనకు భవిష్యత్‌లో ఎమ్మెల్యే అయ్యే యోగ్యత లేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయతో అనేక పదవులు అనుభవించి, నేడు వైఎస్సార్ సీపీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇప్పటికై నా వంశీకృష్ణ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పరిస్థితే అయోమయంగా ఉందన్నారు. జూన్ 4న వెలువడే ఫలితాల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు విశాఖ ఎంపీ స్థానాన్ని కూడా వైఎస్సార్ సీపీ దక్కించుకుంటుందన్నారు. సమావేశంలో వివిధ విభాగాల అధ్యక్షులు వంకాయల మారుతీ ప్రసాద్, బోని శివరామకృష్ణ, అప్పన్న పాల్గొన్నారు.