
మౌలిక వసతుల కల్పనలో రాజీ పడొద్దు
జీవీఎంసీ అధికారులను ఆదేశించిన
కలెక్టర్ హరేందిర ప్రసాద్
డాబాగార్డెన్స్: నగర ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో జీవీఎంసీ అధికారులు సమష్టిగా పనిచేయాలని కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జ్ కమిషనర్ డాక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శనివారం తన చాంబర్లో జీవీఎంసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పక్కాగా వ్యర్థాల సేకరణ జరగాలని, డ్రైనేజీలు శుభ్రంగా ఉండాలని ఆదేశించారు. బహరింగ ప్రదేశాల్లో, డ్రైనేజీల్లో వ్యర్థాలు వేసే వారిని గమనించి అపరాధ రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జీవీఎంసీ ప్రజారోగ్య అధికారులను చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ప్లానింగ్ కార్యదర్శులు, వీఆర్వోలు, జోనల్ కమిషనర్లు సంయుక్తంగా ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత ప్లానింగ్ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీచ్‌రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల ఖాళీ స్థలాన్ని డెబ్రిస్‌తో కప్పి, విస్తరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రణాళికా అధికారులను ఆదేశించారు.మురుగు కాలువ గూండా వెళ్లే తాగునీటి పైపులైన్లు గుర్తించి, తాగునీరు కలుషితం కాకుండా చూడాలని సూచించారు. నగరంలో వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టాలని జోనల్ కమిషనర్లకు కలెక్టర్ ఆదేశించారు. మార్చి 31 నాటికి రావాల్సిన రూ.100 కోట్ల పన్నులు వసూలు చేయాలని డీసీఆర్ శ్రీనివాస్‌ను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment