ఏయూపై చిన్నచూపు..! | - | Sakshi
Sakshi News home page

ఏయూపై చిన్నచూపు..!

Published Sun, Mar 2 2025 1:38 AM | Last Updated on Sun, Mar 2 2025 1:37 AM

ఏయూపై చిన్నచూపు..!

ఏయూపై చిన్నచూపు..!

● బడ్జెట్‌ కేటాయింపుల్లో అంకెల గారడీ ● వందేళ్ల ఉత్సవాలకు నిధులు ఊసేలేదు ● భారంగా మారనున్న వేతనాల చెల్లింపులు ● గత బకాయిలపై స్పష్టత కరువు

విశాఖ విద్య : ఆంధ్ర యూనివర్సిటీకి బడ్జెట్‌ కేటాయింపులు అంతా అంకెల గారడీలా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది లెక్కను ప్రాతిపదికగా.. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.389.34 కోట్లు నిధులు కేటాయించారు. అయితే ఏప్రిల్‌లో ఆంధ్ర యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మకమైన వందేళ్ల పండగను ఏడాదంతా జరుపుకునేలా వర్సిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా బడ్జెట్‌ కేటాయింపులు ఏ మూలకు సరిపోతాయని ఇక్కడి ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. ఏయూ విషయంలో కూటమి ప్రభుత్వం పైకి చెప్పేది ఒకటైతే, ఆచరణలో మరోలా ఉందని విద్యావేత్తలు బాహాటంగానే అంటున్నారు.

నాన్‌ టీచింగ్‌కు టైం స్కేల్‌ ఇంకెప్పుడో..

వర్సిటీలో పనిచేస్తున్న నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇస్తామని కూటమి నేతలు అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చారు. బడ్జెట్‌ కేటాయింపులు ఇందుకు అనుగుణంగా లేకపోవడంతో.. ఇప్పట్లో ఆ హామీ అమలయ్యే పరిస్థితి కనిపించటం లేదు. ఏయూలో 1000 మంది వరకు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరంతా తమకు టైం స్కేల్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకతప్పని పరిస్థితి.

వేతనాలకు తప్పని ఎదురుచూపులు

వర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కలిపి 2,010 మంది వరకు పనిచేస్తున్నారు. వీరికి నెలకు రూ.16 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తున్నారు. పెన్షనర్స్‌ 3,500 మంది వరకు ఉన్నారు. వీరికి నెలకు రూ.17.5 కోట్లు అవసరం ఉంటుంది. యూనివర్సిటీలో ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.43 కోట్లు వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం సవ్యంగా నిధులు మంజూరు చేయకపోవడంతో.. వర్సిటీ సొంత నిధులతో వీరందరికీ అడ్వాన్స్‌లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వర్సిటీ ఆచార్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే సామాజిక మాధ్యమాల వేదికగా వర్సిటీ పాలనాధికారులపై బాణాలు రువ్వుతున్నారు.

బకాయిల ఊసేది

ఆచార్యులు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది, పెన్షనర్స్‌కు అడ్వాన్స్‌ల రూపేణా చెల్లించిన రూ.68 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. దీనిని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. జనవరి నెల వేతనాలు నేటికీ అందకపోగా, ఫిబ్రవరి వేతనాలు ఇంకెప్పుడు ఇస్తారో అని వర్సిటీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రూ.68 కోట్లు వస్తే గానీ వేతనాలు చెల్లించలేమని వర్సిటీ అధికారులు చెబుతుండడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

‘ఎయిడెడ్‌’ భారం ఏయూదే..?

ఆంధ్ర యూనివర్సిటీలో 60 మంది వరకు ఎయిడెడ్‌ కాలేజీల నుంచి వచ్చిన వారు పనిచేస్తున్నారు. వీరికి నెలకు సుమారుగా రూ.1.2 కోట్లు వేతనాల రూపేణా ఏయూ చెల్లిస్తోంది. వీరందరికీ ప్రమోషన్లకు సంబంధించిన ప్రోత్సాహకాలను యూనివర్సిటీనే చెల్లించాలని తాజాగా ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇది వర్సిటీకి మరింత భారం కానుంది.

వందేళ్ల ఉత్సవాలు ఎలా..?

వర్సిటీ వందేళ్ల ఉత్సవాలకు బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు ఉంటాయని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయకపోవడంతో వందేళ్ల ఉత్సవాలకు నిధులు ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

గత మూడేళ్లలో కేటాయింపులు

సంవత్సరం రూ. కోట్లలో 2022-23 424.29 2023-24 402.40

2024-25 389.34

2025 - 26 389.34

(ఏడాది పొడవునా వందేళ్ల ఉత్సవాలు నిధులు లేవు ప్రభుత్వం నుంచి రూ.68 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement