వ్యక్తిగత విమర్శలు చేసిన కూటమి నేతలపై చర్యలెప్పుడు?
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ సాక్షిగా తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, తమ పార్టీ నేతలపై అత్యంత హీనంగా, బండ బూతులు మాట్లాడిన కూటమి పార్టీల నాయకులపై ఎప్పుడు చర్యలు తీసుకుంటా రని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సినీనటుడు పోసాని కృష్ణమురళికి ఆరోగ్యం బాలేకపోయినా జైలులో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. లాసన్స్‌బేకాలనీలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు పోసాని అరెస్ట్ ద్వారా కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసిందని, తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఇదే ఆనవాయితీని అనుసరిస్తారనే విషయం మరిచిపోవద్దని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే జాలిపడే పరిస్థితి కలుగుతోందన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగమంతా చంద్రబాబు, లోకేష్‌ను పొగడడానికే సరిపోయిందని ఎద్దేవా చేశా రు. ‘వాస్తవ రూపంలో ఈ బడ్జెట్ అమలు కాదు.. ఇదంతా అంకెల గారడీ బడ్జెట్ మాత్రమే.. సంపద సృష్టి లేదు. రూ.80వేల కోట్లను ఎలా పూడ్చుతారు.. అంటే జనం మీద బాదేస్తారా..? ఈ బడ్జెట్ కేవలం ఎల్లో మీడియాలో రాసుకోవడానికే పరిమితం’ అని కన్నబాబు అన్నారు. ఒకరేమో బాహుబలి బడ్జెట్ అని, మరొకరు పేదల బడ్జెట్ అని డబ్బా కొట్టడానికే సరిపోయిందన్నారు. తమ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అప్పు చేసి కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల కోసం అప్పు చేస్తే రాష్ట్రాన్ని శ్రీలంకలా చేస్తున్నారని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం ఏర్పడి 9 నెలలు కాలంలో రూ.1.20 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. లక్షల కోట్లు ఎందుకు అప్పు చేశారంటే.. పాత బకాయిలు చెల్లించామని చెబుతున్నారు. మరి 2014–19లో చేసిన బకాయిలను తమ ప్రభుత్వంలో చెల్లించలేదా..? అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు ఊసేలేదని.. రెండు పథకాల కు కూడా అరకొర నిధులే కేటాయించారని దుయ్యబట్టారు. పేదలకు వైద్యం అందించే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారని ఈ బడ్జెట్‌ను చూస్తే స్పష్టంగా కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. పార్టీ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు.
పోసాని అరెస్ట్‌తో కొత్త సంస్కృతికి తెరతీశారు
అంకెల గారడీతో రాష్ట్ర బడ్జెట్
ఎల్లో మీడియాలో రాతలకే ఈ బడ్జెట్ పరిమితం
చంద్రబాబు రూ.1.20 లక్షలు అప్పు చేస్తే గొప్పగా రాతలా?
వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment