14న అప్పన్న డోలోత్సవం
సింహాచలం: ఫాల్గుణ పౌర్ణమి పురస్కరించుకుని ఈ నెల 14న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి డోలోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో కె.సుబ్బారావు శనివారం మీడియాకు తెలిపారు. ఈ మేరకు కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఉన్న మండపంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను పల్లకిలో వేంజేపచేసి మెట్ల మార్గంలో కొండదిగువకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. కొండదిగువ పుష్కరిణి సత్రం ప్రాంగణంలో ఉన్న మండపంలో వేంజేపచేసి డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం జరుగుతుందన్నారు. తదుపరి తిరువీధి నిర్వహించి, తిరిగి కొండపైకి చేర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయం నిత్యకల్యాణం రద్దుచేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment