నకిలీ పోలీస్ అరెస్ట్
ఎంవీపీకాలనీ: పోలీసు అధికారినని చెప్పి నగరంలో పలు మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసు వివరాలు వెల్లడించారు. నగరంలోని బాజీ జంక్షన్‌కు చెందిన చెల్లుబోయిన లోచన్‌కుమార్ పోలీసు అధికారినని చెప్పుకుంటూ.. ఫేక్ ఐడీ కార్డులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రైఫిల్స్, వాకీటాకీలతో దిగిన ఫొటోలు చూపిస్తూ చాలా కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఆయా మోసాలకు సంబంధించి ఇప్పటికే అతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్‌లో ఓ చీటింగ్ కేసు, గోపాలపట్నం పోలీసు స్టేషన్‌లో కొట్లాట కేసు నమోదైంది. తాజాగా నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలకు వేలం పాట జరుగుతుందని.. తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తానని చెప్పి పలువురు దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరిని మోసం చేశాడు. ఎంవీపీ కాలనీ సెక్టార్–3కి చెందిన బలివాడ రామ్‌సాయి గోపాల్ అనే వ్యక్తి నుంచి రూ.61,900 వసూలు చేశాడు. గోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో ఓ వ్యక్తి నుంచి ఇదే తరహాలో రూ.26 వేలు వసూలు చేశాడు. అయితే వాహనాలు ఇప్పించాలని రామ్‌సాయి గోపాల్ ఒత్తిడి చేయడంతో అతని ఫోన్, మేసేజ్‌లకు సమాధానం ఇవ్వకుండా కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన రామ్‌సాయి గోపాల్ ఇటీవల నగర పోలీసు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు లోచన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 318(4), 319(2) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మూర్తి వెల్లడించారు. లోచన్ కుమార్ 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో ఎంవీపీ సీఐ మురళీ, ఎస్‌ఐ ధనుంజయ్ నాయుడు పాల్గొన్నారు.
నకిలీ పోలీస్ అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment