దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
● ఐపీఎస్ అధికారి సునీల్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి ● వైఎస్సార్ సీపీ దళిత విభాగం నేతల డిమాండ్
సాక్షి, విశాఖపట్నం: దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి మండిపడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్‌పై అక్రమంగా కేసులు పెట్టి వేధించిందని, ఇదే కొనసాగితే రాష్ట్రంలోని దళితులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బోని శివరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలనే ఆలోచన తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తపన లేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులకు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఐదేళ్ల కిందటనాటి ఎయిర్‌పోర్టు కేసు అని చెప్పి తనకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తన లాగే రాష్ట్రంలో అనేక మంది దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇదే కొనసాగితే ఈ ప్రభుత్వం భూస్థాపితం కావడం తథ్యమని హెచ్చరించారు. మంచా మల్లేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిని సంతృప్తి చేసేందుకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముగ్గురూ దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సునీల్‌కుమార్ ఎప్పుడో తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో దళి త మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తాను ఒక పోస్టు పెట్టినా, వీడియో పోస్టు చేసినా.. అసభ్యకరంగా కామెంట్లు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇవేమి కూటమి ప్రభుత్వానికి కనిపించవా అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment