ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు
విశాఖ విద్య: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని యూటీఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్ అంబేడ్కర్‌లు అన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంగళవారం సంఘం ముఖ్యనాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి చెందడం, వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్ సంఘానికి వైఎస్సార్‌సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని దానికి యూటీఎఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే యూటీఎఫ్‌కు రాజకీయాలు అంటగట్టడం సరికాదన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే కూటమి పార్టీల వారు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా రాజకీయం చేయటం ద్వారా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment