ఆచరణే అసలైన దేశభక్తి | - | Sakshi
Sakshi News home page

ఆచరణే అసలైన దేశభక్తి

Mar 17 2025 9:40 AM | Updated on Mar 17 2025 9:39 AM

● ఆర్‌ఎస్‌ఎస్‌ సహప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి ● అట్టహాసంగా ఆర్‌ఎస్‌ఎస్‌ మహానగర్‌ సాంఘిక్‌ ● ఘోష్‌ ప్రదర్శన, విన్యాసాలతో అబ్బురపరిచిన స్వయంసేవకులు

సీతమ్మధార: ఏ పని చేసినా భారతదేశం గర్వించేలా ఉండాలని, భారతీయతను ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ సహ ప్రాంత కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అక్కయ్యపాలెంలోని పోర్ట్‌ స్టేడియంలో ఆదివారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) మహానగర్‌ సాంఘిక్‌ ఉత్సాహంగా జరిగింది. పూర్ణగణవేష్‌తో వందలాది స్వయంసేవకులు హాజరయ్యారు. ఘోష్‌ ప్రదర్శనతో స్వయం సేవకులు ఆకట్టుకున్నారు. పలు రకాల విన్యాసాలతో అబ్బురపరిచారు. ఈ సందర్భంగా మాలపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మేధాశక్తి, నైపుణ్యానికి మనదేశం పెట్టింది పేరన్నారు. ధర్మ రక్షణ కోసం ఆర్‌ఎస్‌ఎస్‌ వందేళ్లుగా పని చేస్తోందన్నారు. వ్యక్తికి దేశభక్తి, సంస్కృతి పట్ల నిష్ట ఉండాలని, దేశానికి పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వ్యక్తి నిర్మాణంతోనే సంఘ నిర్మాణం జరుగుతుందన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి దేశాన్ని దెబ్బతీసే వారిని ఇప్పటికీ చూస్తున్నామని.. అందుకే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలదేనన్నారు. స్వదేశీ భావన ఉపన్యాసాలతో సాధ్యం కాదని, కార్యాచరణ అవసరమన్నారు. మతం పేరుతో భూభాగాన్ని పోగొట్టుకున్నామని గుర్తుచేశారు. ప్రపంచంలోని అనేక సవాళ్లకు హిందూత్వమే సమాధానమని, మనదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఒక అద్భుతమని కొనియాడారు. అమెరికా నేడు కుటుంబ వ్యవస్థను కోరుకుంటోందన్నారు. దేశంలో మళ్లీ ప్రాంతీయ భేదాలు సృష్టించి విడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దేశంలో సీ్త్రకి స్వాతంత్య్రం లేదని సోషల్‌ మీడియాలో నూరిపోస్తున్నారని, సీ్త్రని ప్రతి దశలోనూ కాపాడే వ్యవస్థ మనకుందన్నారు. ఒక ఆలయం మీద ఆధారపడి పది మంది జీవిస్తున్నారు. ఆలయాలు హిందూ సమాజాన్ని మేలుకొలిపే శక్తి కేంద్రాలుగా ఉన్నాయన్నారు. పర్యావరణ సమతుల్యత మన సంస్కృతిలోనే ఉందని, నదులను తల్లులుగా భావిస్తామన్నారు. రాజకీయ స్వార్థాల కోసం దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ట్రినీటిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డైరెక్టర్‌ నాగ వెంకట సత్యేంద్ర, మహానగర సంఘ్‌ చాలక్‌ పి.వి.నారాయణరావు, సహ సంఘ్‌ చాలక్‌ బి.సి.అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement