కూటమి
మేయర్ పీఠం కోసం కుయుక్తులు
● రంగంలోకి దిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ● కార్పొరేటర్‌కు రూ.25 లక్షల చొప్పున బేరం
● ససేమిరా అంటున్న వారికి ఎక్కువ ఆఫర్లు ● లొంగని వారికి బెదిరింపులు
డాబాగార్డెన్స్ : విశాఖలో కూటమి కుట్రలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే దుర్బుద్ధితో తెర వెనుక అప్రజాస్వామిక ప్రయత్నాలు సాగిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కోట్లాది రూపాయలు సిద్ధం చేశారు. ఒక్కొక్క కార్పొరేటర్‌కు ఏకంగా రూ.25 లక్షలు వెలకట్టి, వారిని కొనుగోలు చేసేందుకు తెగబడినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. కొందరికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ, మరికొందరి వ్యాపారాలను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఎవరైనా లొంగకపోతే వారి ఆస్తులను ధ్వంసం చేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా అప్రజాస్వామిక విధానాలను అవలంబించి స్థానిక సంస్థలను చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు విశాఖ నగర పీఠాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్రలు పన్నుతోంది.
గ్రేటర్‌లో బలం లేకపోయినా..
గ్రేటర్‌లో కూటమికి సంఖ్యా బలం లేదు. మహా విశాఖ నగరపాలక సంస్థలోని 98 వార్డులకు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ప్రస్తుతం 19వ వార్డు మినహాయిస్తే 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైఎస్సార్ సీపీ 58, తెలుగుదేశం 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, భాజపాకు ఒక్కొక్కరు, నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లు గెలుపొందారు. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లను నయానో భయానో తమకు మద్దతు తెలిపేలా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతున్నారు. ఇందుకోసం అవసరమైతే క్యాంపు రాజకీయాలకు కూడా సిద్ధమవుతున్నారు. కూటమిలో చేరితే రూ.25 లక్షలు ఇస్తామని ఎర వేస్తున్నట్టు తెలిసింది. అక్కడికీ లొంగకపోతే మరింత ఎక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వార్డుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో సీటు మీదే.. ఇలా పలు విధాలుగా లొంగదీసుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.
కమిషనర్‌నే నియమించుకోలేయపోయారు
కూటమి ప్రభుత్వం దాదాపు రెండు నెలలుగా జీవీఎంసీ కమిషనర్‌ను నియమించకుండా పాలనను గాలికి వదిలేసిందని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10న వామపక్షాలు జీవీఎంసీలో పాలన పూర్తిగా గాడి తప్పిందని నిరసన తెలిపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడి, అధికారులు సైతం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. దోమల బెడదతో నగర ప్రజలు రోగాల బారిన పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఎండాకాలం కావడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా.. వార్డుల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయినా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం కమిషనర్‌ను నియమించలేని అసమర్థ ప్రభుత్వం.. కుట్రలు చేసి అధికారం దక్కించుకోవాలని చూడటం సిగ్గుచేటని మండిపడుతున్నారు. కూటమి నేతలు కుట్రలను మానుకొని పాలనపై దృష్టి సారించాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అంతు చూస్తామంటూ బెదిరింపులు
కూటమి నేతల ఆఫర్లకు తలొగ్గని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు దిగుతున్నారు. మద్దతు తెలపని కార్పొరేటర్లను ‘మీ అంతు చూస్తాం’అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వార్డుల్లో అభివృద్ధి పనులు జరగనివ్వబోమని, వ్యాపారాలు, ఇతర పనులు సాఫీగా సాగనివ్వబోమని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో మా ప్రభుత్వమే ఉంది. మా నాయకుడు ఇప్పటికే వైఎస్సార్ సీపీకి ఎటువంటి పనులు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.’ అంటూ కూటమి నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీకి ద్రోహం చేయలేను
‘నాకు వైఎస్సార్ సీపీ రాజకీయ భిక్ష పెట్టింది. పార్టీకి ద్రోహం చేయలేను. ఇప్పటికే జనసేన, టీడీపీల నుంచి నాకు ఫోన్లు వచ్చాయి. వాళ్లు ఎన్నో ప్రలోభాలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా నువ్వే ఉంటావని హామీ ఇచ్చారు. నా వార్డు అభివృద్ధికి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. వార్డులో జనసేన, టీడీపీ కార్యకర్తలు నీ వెంటే ఉంటారని తెలిపారు. అంతేకాదు నాకు మరిన్ని పదవులు ఇస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారు. డబ్బు కూడా ఇస్తామన్నారు.’ అంటూ ఓ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు.