● టైమ్ బ్యాంక్ కాన్సెప్ట్‌తో ఇది సాధ్యం ● కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: రాజస్థాన్‌కు చెందిన పి.సి.జైన్, అతని బృందం అభివృద్ధి చేసిన టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ద్వారా వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరుకుతుందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో విశాఖను పైలట్ జిల్లాగా ఎంపిక చేసిందన్నారు. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ సమీపంలోని ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ భవన్‌లో సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండటంతో సీనియర్ సిటిజన్లకు ఒంటరితనం అనే భావన ఉండేది కాదన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడం వల్ల వారు ఒంటరిగా మారుతున్నారని, రోజు వారీ అవసరాలు, వారి భావోద్వేగ అవసరాల్లో ఇతరుల తోడు అవసరమవుతుందన్నారు. ఈ టైమ్ బ్యాంక్ భావనతో ఆ పరిస్థితిని మార్చుకోవచ్చని కలెక్టర్ అన్నారు. అనంతరం సంబంధిత బ్రోచర్‌ను కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఆవిష్కరించారు.
ఉచితంగా రిజిస్ట్రేషన్
టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్‌లో భాగంగా 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారు www.timebankofindia.com వెబ్‌సైట్‌లో లేదా బ్యాంక్ అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ జె.మాధవి చెప్పారు. రిజిస్ట్రేషన్, సేవ, పాస్ బుక్ పొందడం మొదలైనవన్నీ ఉచితంగా లభిస్తాయని తెలిపారు. యువకులు మాత్రమే కాకుండా, సహాయం అందించడానికి అర్హులైన వారందరూ స్వచ్ఛందంగా సేవ చేయవచ్చని, ఆ మేరకు వారి సమయం వారి పాస్ పుస్తకాల్లో జమ అవుతుందని వివరించారు. వారికి అవసరమైనప్పుడు ఇతరుల నుంచి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు. నమోదిత సభ్యులను స్థానిక నిర్వాహకుల ద్వారా వారి కేవైసీ ధ్రువీకరిస్తామని.. పోలీస్ వెరిఫికేషన్‌కు కూడా పంపిస్తామని స్పష్టం చేశారు. పైలట్ జిల్లాగా ఎంపికై న విశాఖపట్నంలో ఈ కాన్సెప్ట్ అమలుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో భాగంగా టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతినిధులు కలెక్టర్, ఇతర అధికారులను సత్కరించారు. క్రైం డీసీపీ రాజ్ కమల్, డీఆర్డీఏ పీడీ లక్ష్మీపతి, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, వి.ఎస్.కళాశాల ప్రిన్సిపాల్ విజయ బాబు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.