
అక్రమ నిర్మాణాల కూల్చివేత
మధురవాడ: విశాఖ రూరల్ మండల కొమ్మాది వెంకట్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన షెడ్లను రెవెన్యు అధికారులు తొలగించారు. కోర్టు వివాదంలో ఉండి రద్దు అయిన డి. పట్టా భూముల్లో ఏర్పాటు చేసిన కోళ్ల ఫారం, ఇతర షెడ్లను శుక్రవారం నేల మట్టం చేశారు. ఆక్రమణదారులతో రెవెన్యూలోని కొందరు దిగువ స్థాయి అధికారులు లాలూచీ పడడంతో కబ్జాలపర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో సుమారు రు.40 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి రెక్కలొచ్చాయి. ఈ అక్రమ వ్యవహారంపై సాక్షి దినపత్రికలో ‘రూ.40కోట్లు సర్కారు భూమికి రెక్కలు’ అనే శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధిలేని పరిస్థితిలో ఆక్రమణదారులతో లాలూచీ పడిన రెవెన్యూ అధికారులు పరుగులు తీశారు. కొమ్మాది సర్వే నంబరు. 157/1లో 3.9 ఎకరాల భూమిలో షెడ్‌లు, ఇతర నిర్మాణాలను ఆర్‌ఐ అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో పలువురు వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు ఇతర సిబ్బంది కూల్చివేశారు. ఆక్రమణదారులు నుంచి స్టేట్‌మెంట్‌లు రికార్డు చేశారు. దీనిపై తహసీల్దారు పాల్‌కిరణ్ స్పందిస్తూ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అయితే ఈ భూమి కోర్టు వివాదంలో ఉందని, కోర్టు ఆదేశాలకు భిన్నంగా నిర్మాణాలు చేస్తుండడంతో చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
బాధ్యులపై చర్యలు ఎక్కడ?
కోర్టు ఆదేశాలు ధిక్కరించి కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించేస్తున్న అక్రమార్కులపై, ఇంతటి విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోకుండా, అక్రమార్కులకు అండగా నిలుస్తున్న రెవెన్యూలోని దిగువ స్థాయి అధికారులు, సిబ్బందిపై చర్యలు చేపట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ నిర్మాణాల కూల్చివేత

అక్రమ నిర్మాణాల కూల్చివేత