విశాఖ లీగల్: కేసుల రాజీకి మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉపయుక్తంగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. ఐదు రోజులుగా జిల్లా కోర్టు నూతన ప్రాంగణంలోని సమావేశ మందిరంలో జరుగుతున్న న్యాయవాదుల మధ్యవర్తిత్వ శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. జిల్లాకు చెందిన న్యాయవాదులు, ప్రభుత్వ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మధ్యవర్తిత్వ విషయంలో వెనుకబడి ఉందన్నారు. శిక్షితులైన న్యాయవాదులు కేసులను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించే దిశగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఫలితాలను అందించాలన్నారు. మధ్యవర్తిత్వ జాతీయ శిక్షకురాలు ఎస్.అరుణాచలం మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఓ వెలుగు రేఖగా చెప్పారు. ఈ పక్రియ ద్వారా కేసులు రాజీ చేసుకుంటే బహుళ ప్రయోజనాలు ఉంటాయన్నారు. మరో జాతీయ శిక్షకురాలు బీన దేవి మాట్లాడుతూ న్యాయవాదులందరూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉంటే కేసుల రాజీ సులభతరమవుతుందన్నారు. న్యాయస్థానాలపై భారం తగ్గించడం ద్వారా పెండింగు కేసులు సత్వర విచారణకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో 40 మంది న్యాయవాదులు, సిబ్బంది, విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం.వి. శేషమ్మ పాల్గొన్నారు.