● రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం ● ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు
మధురవాడ: కాపులుప్పాడ జీవీఎంసీ డంపింగ్ యార్డుకు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. డంపింగ్ యార్డుకు అత్యంత సమీపంలో ఉన్న ఒక స్క్రాప్ దుకాణంలో మంటలు చెలరేగాయి. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను ఈ దుకాణంలో కంప్రెస్ చేసి, ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే ఇక్కడ చెత్త నుంచి వివిధ రకాల పదార్థాలను వేరు చేసే కార్యకలాపాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రంగా ఉండటంతో మంటలు క్షణాల్లోనే దుకాణం పరిసరాలకు వ్యాపించాయి. చెత్త, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. నిర్వాహకులు, స్థానికులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే తాళ్లవలస, నగరం నుంచి రెండు అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. పెద్ద ఎత్తున ఎగసిన మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 30 లక్షల విలువైన సామగ్రి, యంత్రాలు కాలిపోయాయని దుకాణ నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు భద్రం తెలిపిన వివరాల ప్రకారం, మధ్యాహ్నం 1.15 నుంచి 2 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ చెత్త ఉన్న ప్రాంతంలో పడేయడం వల్ల మంటలు వ్యాపించి ఉండవచ్చని తెలిపారు. స్థానికులు మాత్రం చెత్తను తగలబెట్టడం వల్ల మంటలు స్క్రాప్ దుకాణానికి అంటుకుని ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
============
23టివిఎల్37, మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
23టివిఎల్37ఏ, 37ఏఏ, స్క్రాప్ దుకాణంలో ఎగసి పడుతున్న మంటలు