● సమస్యలపై నేటిలోగా స్పందించకుంటే 28న సమ్మె ● ఆర్‌ఎల్‌సీ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకుల వెల్లడి
ఉక్కునగరం : రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్‌ఎల్‌సీ) సమక్షంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. గురువారం సాయంత్రంలోగా స్పందించకుంటే శుక్రవారం నుంచి సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశంపై బుధవారం ఆర్‌ఎల్‌సీ ఏర్పాటు చేసిన సమావేశంలో యాజమాన్యం ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందులో ప్రధానంగా యాజమాన్యం నిలిపివేసిన 288 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. మెడికల్ చెకప్ పేరిట కార్మికులను తొలగించరాదని, తీసివేసిన కార్మికులను గురువారంలోగా తీసుకోకపోతే ఈనెల 28న సమ్మె తప్పదని స్పష్టం చేశారు. దీనిపై యాజమాన్యం ప్రతినిధులు మాట్లాడుతూ కాంట్రాక్టర్లు చెప్పిన కొంత మందిని తీసుకుంటామని, మెడికల్ చెకప్‌పై కార్మిక చట్టాల ప్రకారం నడుస్తామని తెలిపారు. మార్చి నెలాఖరు ఉత్పత్తికి కీలకం కాబట్టి కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి సహకరించాలని కోరారు. తమ డిమాండ్లపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో 28న ఉదయం 6 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు సమ్మె చేస్తామని ప్రకటించారు. సమావేశంలో యాజమాన్యం నుంచి హెచ్‌ఆర్ జీఎంలు ఎన్.భాను, ఎం.మధుసూదనరావు, డీజీఎం ఖర్, మేనేజర్ శంకర్, కార్మిక సంఘాల నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి శ్రీనివాసరావు, కె.ఎం.శ్రీనివాసరావు, మంత్రి రవి, జి.సత్యారావు, టి.గుర్నాథ్, జి.అప్పన్న, వంశీకృష్ణ, యు.అప్పారావు పాల్గొన్నారు.