సింహాచలం: విశ్వావసు నామ ఉగాది సందర్భంగా ఈ నెల 30న సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి పెళ్లిరాట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె.సుబ్బారావు గురువారం వెల్లడించారు. ఆ రోజు ఉదయం స్వామివారికి విశేష అర్చన, ఉగాది పచ్చడి నివేదన ఉంటాయన్నారు. సాయంత్రం 4 నుంచి ఆలయ ఆస్థాన మండపంలో పంచాంగశ్రవణం నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామివారి పెళ్లిరాట ఉత్సవం జరుగుతుందన్నారు. ఆ తర్వాత పండితులకు సత్కారాలు, దాతలకు విశిష్ట సేవా పురస్కారాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. సాయంత్రం 4.30 సమయంలో స్వామి మూలవిరాట్‌పై సూర్యకిరణాలు పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమాల అనంతరం స్వామికి తిరువీధి నిర్వహిస్తామన్నారు.