విశాఖ విద్య: లైంగిక వేధింపులకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు. గురువారం ఏయూలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏయూ సంయుక్తంగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని, మాట్లాడారు. చిన్నారులను లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షించడానికి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. నేరానికి పాల్పడిన వారు మైనర్ అయినా శిక్ష తప్పదన్నారు. పోక్సో కేసులో జీవిత ఖైదు, 20 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. మైనర్ పట్ల అంగీకారంతో అనుచితంగా ప్రవర్తించినా అది నేరం కిందే వస్తుందన్నారు.
ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ విభిన్న సామాజిక అంశాలపై విద్యార్థులను చైతన్యం చేసేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న కుటుంబాలు ఏర్పడడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నార. యువత నేరపూరిత చర్యలలో భాగమై తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, న్యాయమూర్తి ఎం.వెంకట శేషమ్మ, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వరి పోక్సో చట్టాన్ని విపులంగా వివరించారు. ఏడీసీపీ మోహనరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ జి.జయదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పోక్సో చట్టంపై అవగాహన పెంచుకోవాలి
జిల్లా న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్