సీతమ్మధార: జీవీఎంసీ మేయర్‌గా ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమారిని కొనసాగించాలని, జీవీఎంసీ పాలకమండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకే కేటాయించాలని యాదవ ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ ఆల్సి అప్పలనారాయణ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా యాదవ సంఘం నేతృత్వంలో గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలనారాయణ మీడియాతో మాట్లాడారు. యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, విశాఖలో ఉన్న ఒక్క మేయర్ పదవిని కూడా తొలగించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యాదవులను కించపరిచేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మేయర్ విషయంలో అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. యాదవులను బీసీ–డీ నుంచి బీసీ–బీకి మార్చాలని డిమాండ్ చేశారు. జాతీయ యాదవ హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడిబోయిన బాబ్జీ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ తూర్పు సమన్వయకర్త ఎడ్ల వేణుగోపాల్, యాదవ జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.