మహారాణిపేట: స్వర్ణాంధ్ర సాకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అధికారులు సమష్టి కృషితో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సూచించారు. ఈ నెల 25, 26వ తేదీల్లో మూడో విడత కలెక్టర్ల సదస్సు అంశాలను శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన సమావేశంలో జిల్లా అధికారులకు కలెక్టర్ వివరించారు. ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర –2047 విజన్ ప్లాన్, విశాఖ 2025–29 ప్లాన్ ప్రాతిపదికగా ముందుకు సాగాలని అధికారులను పేర్కొన్నారు.
లక్ష్యాలు చేరుకోవాలి: పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, ఆ దిశగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, కొత్త హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేసేందుకు సహకారం అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రుషికొండ, గంభీరంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ కాంప్లెక్సులు నిర్మించాలని సూచించారు.
ఆరు నెలల్లో మెట్రో భూసేకరణకు చర్యలు
విశాఖలో చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్టు అవసరాల నిమిత్తం ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఆరు నెలల్లో మొదటి దశ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని సూచించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ నుంచి అనుసంధానమయ్యే రోడ్ల అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్. విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.