కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్
పరవాడ: దేశ విద్యుత్ రంగానికి ఎన్టీపీసీ వెన్నెముకగా నిలుస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అన్నారు. సింహాద్రి ఎన్టీపీసీని కేంద్ర మంత్రి శుక్రవారం సందర్శించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ శర్మ, అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఏక్ పెడ్ మా కే నామ్ థీమ్‌తో చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సంస్థలోని కంట్రోల్ రూమ్‌ను సందర్శించి అక్కడి విధులు నిర్వహిస్తున్న యువ ఇంజినీర్లతో సంభాషించారు. తర్వాత సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి 25 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌లను సందర్శించారు. మంత్రి నాయక్ మాట్లాడుతూ లక్షలాది మందికి నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్న ఎన్టీపీసీకి సింహాద్రి యూనిట్ ఎంతో దోహదపడుతోందన్నారు. 2070 నాటికి నికర జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎన్టీపీసీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.