
కూటమికి తొత్తులుగా పోలీసులు
● అర్ధరాత్రి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులకు బెదిరింపు ● పోలీసుల తీరుపై కలెక్టర్, సీపీకి వైఎస్సార్‌సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విశాఖపట్నం : చట్టానికి లోబడి విధులు నిర్వర్తించాల్సిన కొంతమంది పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఇంటికి పోలీసులు అర్ధరాత్రి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దీన్ని సహించేది లేదన్నారు. జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కూటమి నేతలు అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. వారి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను బెదిరించి తమ వైపు తిప్పుకునే కుటిలయత్నాలకు పాల్పడుతున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం మల్కాపురం ప్రాంతంలోని ఓ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఇంటికి అర్ధరాత్రి పోలీసులు వెళ్లి వారి కుటుంబ సభ్యులను బెదిరించారని పేర్కొన్నారు. అందరిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామంటూ హంగామా సృష్టించారన్నారు. ఈ విషయమై మల్కాపురం పోలీస్‌స్టేషన్ సీఐకి ఫోన్ చేస్తే వెంటనే కట్ చేశారని తెలిపారు. మాజీ మంత్రి, ఓ పార్టీ జిల్లా అధ్యక్షుడినైన తన ఫోనే కట్ చేస్తే సామాన్యుల ఫోన్ వీరు లిఫ్ట్ చేశారా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, సమన్వయకర్తలు కె.కె.రాజు, దేవన్‌రెడ్డి, ముఖ్యనేతలు రవిరెడ్డి, చిక్కాల రామారావు, పేడాడ రమణకుమారితో కలిసి వెళ్లి కలెక్టర్ ఎం.ఎన్ హరేందర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చిలకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడిన మల్కాపురం పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కార్పొరేటర్ల కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు బోని శిమరామకృష్ణ, దొడ్డి కిరణ్, జీలకర్ర నాగేంద్ర, మార్కండేయులు పాల్గొన్నారు.