
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ దక్కేనా?
● గతంలో మెరిసిన విశాఖ.. ఇప్పుడు ప్రశ్నార్థకం ● పడకేసిన పారిశుధ్యం.. ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ల మూత ● కమిషనర్‌ను నియమించుకోలేని అసమర్థత ● ‘కూటమి’ హయాంలో గాడి తప్పిన జీవీఎంసీ పాలన
డాబాగార్డెన్స్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విశాఖ.. ఈ సారి ఎలాంటి ర్యాంకు సాధిస్తుందనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. చంద్రబాబు హయాం(2018–19)లో 23వ స్థానానికి పరిమితమైన విశాఖ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో గణనీయమైన ప్రగతిని కనబరిచింది. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో టాప్–4లో నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిచింది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు కోసం చేపట్టిన కార్యక్రమాలు ఈసారి ఆ స్థాయిలో జరగలేదని ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా జీవీఎంసీకి ప్రస్తుతం కమిషనర్ కూడా లేకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చేలా ఉంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో విశాఖ ఏ స్థానాన్ని దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.
పర్యవేక్షించే నాథుడేడి?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీఎంసీ పాలన పూర్తిగా గాడి తప్పింది. రెండున్నర నెలలుగా జీవీఎంసీకి కమిషనర్ లేకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. పారిశుధ్య పనులు అటకెక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరుగుతున్న సమయంలోనే నగరంలో చెత్త పేరుకుపోతోంది. టైర్లు లేకపోవడంతో చెత్త తరలించే టిప్పర్లు, పొక్లెయిన్లు మూలకు చేరాయి. జీవీఎంసీలోని అన్ని జోన్లలో 30కి పైగా పొక్లెయిన్లు నిరుపయోగంగా ఉన్నాయి. పారిశుధ్య కార్మికులకు కనీస పనిముట్లు కూడా అందుబాటులో లేవు. ఈ దుస్థితిపై జీవీఎంసీ శానిటేషన్ అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఓ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటించారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియత్రించినట్లు కలెక్టర్ చెప్పారు. అయితే క్షేత్రస్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు. వీధుల్లో ఎక్కడికక్కడే చెత్త దర్శనమిస్తోంది.
అవిశ్వాసంపై పెట్టిన శ్రద్ధ.. పాలనపై లేదెందుకు?
గతమెంతో ఘనం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం గణనీయమైన అభివృద్ధి సాధించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో నగరంలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. కొత్తగా రోడ్లు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు, జంక్షన్లను ఆధునికీరించారు. బస్ షెల్టర్లను కొత్తగా తీర్చిదిద్దారు. మురుగునీటి కాలువలు నిర్మించారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి వైఎస్సార్ క్లినిక్‌లు ప్రారంభించారు. నగరంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి యూసీసీటీఆర్‌ఎఫ్ ప్రాజెక్ట్‌ల ద్వారా స్వీపింగ్ మిషన్లను ఉపయోగించారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎకో వైజాగ్ పేరుతో ఎకో క్లీన్, ఎకో గ్రీన్, ఎకో బ్లూ, ఎకో జీరో ప్లాస్టిక్, ఎకో జీరో పొల్యూషన్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రస్తుతం కమిషనర్ లేకపోవడంతో ఈ పనులన్నీ ఆగిపోయాయి. జీవీఎంసీ పాలన పూర్తిగా గాడి తప్పిందని వామపక్ష నేతలు గత నెల 10న జీవీఎంసీ ఎదుట నిరసన తెలిపారు. కనీస సౌకర్యాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
వ్యర్థాల నిర్వహణకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌ఆర్‌ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) సెంటర్లు ప్రస్తుతం మూలన పడ్డాయి. జగదాంబ జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన వుమెన్స్ రెస్టో కేఫ్ నిరూపయోగంగా మారింది. నిధులు లేకపోవడంతో అభివృద్ధి, పారిశుధ్య పనులు ఆగిపోయాయి. ప్రధాన రహదారుల్లో కొంతమేర పారిశుధ్యం మెరుగ్గా ఉన్నా, గల్లీలు, వీధు ల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. దోమల నివారణ కు చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజలను భాగస్వాములను చేయాల్సిన స్వచ్ఛత కార్యక్రమాల్లో సచివాలయం సిబ్బందిపై ఒత్తిడి తీసుకొచ్చి.. ప్రభుత్వం అభాసుపాలైంది. ఆ మధ్య ఓటీపీలు సేకరించలేదని సచివాలయ కార్యదర్శులకు జోనల్ కమిషనర్ నోటీసులు జారీ చేయడంపై విమర్శలు వచ్చాయి. మేయర్‌పై అవిశ్వాసంపై పెట్టిన శ్రద్ధను కూటమి నేతలు కమిషనర్‌ను నియమించడంపై ఎందుకు చూపడం లేదనే ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనూ మెదులుతోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌ను నియమించలేని అసమర్థత కూటమి ప్రభుత్వానిదేనని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏ ర్యాంక్ సాధిస్తుందో చూడాలి.
దటీజ్ వైఎస్ జగన్
చంద్రబాబు ప్రభుత్వ హయాం(2018–2019)లో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖ నగరం 23వ ర్యాంక్‌కే పరిమితమైంది. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత 2020లో 9వ ర్యాంకు, 2022లో 4వ ర్యాంకు సాధించిన నగరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరోసారి 4వ ర్యాంకు సాధించి సగర్వంగా నిలిచింది. విజయవాడ, తిరుపతి కూడా జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించాయంటే ఆ ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది.

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ దక్కేనా?

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్ దక్కేనా?