
వడదెబ్బ.. జాగ్రత్త
మహారాణిపేట: జిల్లాలో భానుడి భగభగలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. వడగాడ్పుల తాకిడి కూడా పెరుగుతోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ, కేజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. కేజీహెచ్‌తోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ)లు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(యూపీహెచ్‌సీ)ల్లో ప్రత్యేక పడకలు సిద్ధం చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు పర్యవేక్షణలో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. జీవీఎంసీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, కార్మికశాఖ, డీఆర్‌డీఏ, డూమా తదితర శాఖల్ని తమ పరిధిలో వడదెబ్బ బాధితులకు సత్వర వైద్య సేవలు అందించేలా సన్నద్ధం చేశారు.
వడదెబ్బ అంటే..
బయట ఉష్ణోగ్రతలు పెరిగితే.. శరీరంపై ఒత్తిడి పెరిగి రక్తనాళాలు ఎక్కువగా తెరుచుకుంటాయి. దీంతో బీపీ తగ్గుతుంది. గుండైపె ఒత్తిడితోపాటు, వేగం పెరుగుతుంది. చెమట ఎక్కువగా పట్టి శరీరం నుంచి ద్రవాలు లవణాలు బయటకు పోతాయి. శరీర సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో బీపీ బాగా పడిపోయి వడదెబ్బకు గురవుతాం.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలి?
తొలుత వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా చల్లని ప్రదేశానికి తరలించాలి. పడుకోబెట్టి కాళ్లు కాస్త పైకి ఉండేలా చూడాలి. నీరు, చల్లని పానీయాలు తాగించాలి. శరీరాన్ని చల్లబరిచేందుకు తడివస్త్రంతో పదేపదే తుడవాలి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు మెడ కింద, చంకల్లో ఐసు ముక్కలు పెడితే మంచిది. వడదెబ్బ తగిలిన వ్యక్తులు అరగంటలోపు తేరుకుని, కూర్చోగలిగితే ప్రమాదం తప్పినట్లే. లేకుంటే అలాంటి వ్యక్తులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
ముందు జాగ్రత్తలే మేలు
వడదెబ్బకు గురయ్యాక చికిత్స పొందేకంటే.. చిన్నచిన్న ముందు జాగ్రత్తలే మేలని వైద్యులు చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు నీడ పట్టునే ఉండాలి. బయటకు వెళ్లడం తప్పనిసరైనపుడు గొడుగు, స్కార్ఫ్, వాటర్ బాటిల్ తదితర ఏర్పాట్లు తప్పనిసరి. సాధ్యమైనంత వరకు వదులుగా ఉంటే కాటన్ దుస్తులు ధరించడం మేలు. వేసవిలో కొన్ని అలవాట్లను కూడా మార్చుకోవాలి. బాగా నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ తదితర పానీయాలు సేవించాలి. పాలు, టీ, కాఫీ తాగొచ్చు కానీ.. ఆల్కహాల్ బాగా తగ్గించాలి. మద్యం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మాంసాహారం, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉంటే మంచిది.
జిల్లాలో ముందస్తు చర్యలు
కేజీహెచ్‌లో ప్రత్యేక పడకలు
యూపీహెచ్‌సీల్లో రెండేసి బెడ్‌లు
ప్రజలకు వైద్యుల ప్రత్యేక సూచనలు
కేజీహెచ్‌లో ప్రత్యేక వార్డు
కేజీహెచ్‌తోపాటు అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలో రెండేసి పడకలు సిద్ధం చేశారు. కేజీహెచ్‌లో సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ పర్యవేక్షణలో వడదెబ్బకు గురైన వారికి ఏసీ సౌకర్యంతో నాలుగు పడకలున్న ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. ఆస్పత్రిలో చేరే బాధితులకు అవసరమైన ఫ్లూయిడ్స్, మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు.
వడదెబ్బ లక్షణాలు
మగత నిద్ర, మూర్చ, ఫిట్స్, కలవరింతలు, కండరాలు తిమ్మిరెక్కడం, తలనొప్పి, విపరీతమైన చెమట, అలసట, నీరసం ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ తగిలిన వారికి ఒక్కోసారి చెమటలు పట్టకపోవచ్చు. శరీరం మరీ వేడెక్కితే ఈ పరిస్థితి వస్తుంది. అలాంటపుడే మూర్చ లేదా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది.