
ఏసీబీ వలలో అవినీతి చేపలు
కంచరపాలెం: ఏసీబీ అధికారుల వలలో అవినీతి చేపలు చిక్కాయి. జ్ఞానాపురం జోన్–5 జీవీఎంసీ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పబ్లిక్ హెల్త్ విభాగం జనన, మరణ ధ్రువీకరణ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి దండి సత్యసూర్య నాగపూర్ణ చంద్రశేఖర్, ఔట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్ బరకాల వెంకటరమణలు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన భాను ప్రకాష్ తండ్రి మర్రిపాలెం రైల్వే ట్రాక్ వద్ద జనవరిలో మృతి చెందాడు. అతని మరణ ధ్రువీకరణ పత్రం కోసం జ్ఞానాపురం జోన్–5 పబ్లిక్ హెల్త్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి చంద్రశేఖర్, ఔట్‌సోర్సింగ్ సూపర్‌వైజర్ వెంకటరమణలు రూ.40 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.20వేలుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే బాధితుడు భానుప్రకాష్‌కు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఇద్దరు పొరుగు సేవల ఉద్యోగులు లంచం డబ్బులను బాధితుని వద్ద నుంచి తీసుకుంటుండగా జోనల్ కార్యాలయంలో అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అవినీతి నిరోధక (సవరణ) చట్టం–2018 సెక్షన్ 7 కింద కేసు నమోదు చేసి మంగళవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఇవ్వాలని వేధించినట్లయితే సంబంధిత ఏసీబీ అధికారులకు, టోల్ ఫ్రీ నంబర్ 1064 లేదా 9440440057కు తెలియజేయాలని ఆయన కోరారు. దాడుల్లో ఏలూరు రేంజ్ డీఎస్పీ రమ్య, ఇన్‌స్పెక్టర్లు కృష్ణకిషోర్, వెంకట్రావ్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, సుప్రియ పాల్గొన్నారు.
రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జోన్–5 ఉద్యోగులు