
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చిన్నంశెట్టి రాజు
పలువురు అదనపు జిల్లా న్యాయమూర్తులకు బదిలీ
విశాఖ లీగల్: విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా మచిలీపట్నం ఒకటో అదనపు జిల్లా జడ్జి చిన్నంశెట్టి రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆలపాటి గిరిధర్.. నగరంలోని వ్యాట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు అదనపు జిల్లా జడ్జిలకు బదిలీ జరిగింది. విశాఖ పదో అదనపు జిల్లా జడ్జి ఎన్.శ్రీవిద్య కర్నూలు ఏసీబీ కోర్టు న్యాయమూర్తిగా వెళుతున్నారు. అమలాపురం రెండో అదనపు జిల్లా జడ్జి వి.నరేష్ విశాఖ జిల్లా పదో అదనపు జిల్లా జడ్జిగా బదిలీపై వస్తున్నారు. నగరంలోని వ్యాట్ ట్రిబునల్ చైర్మన్ జి.గోపి మచిలీపట్నం ఒకటో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ అయ్యారు. రెండో అదనపు జిల్లా కుటుంబ న్యాయస్థానం న్యాయమూర్తి వి.వాణి ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. విశాఖలోని 12వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పి.గోవర్ధన్ కాకినాడలోని ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నారు. నగరంలోని పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది కాకినాడ రెండో అదనపు జిల్లా న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి పి.మంగాకుమారి వస్తున్నారు.