
బాలుడి మృతిపై సమగ్ర విచారణ
నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి
సీతమ్మధార: విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్‌లో బాలుడి మృతిపై సమగ్ర విచారణ జరుగుతోందని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. పోర్ట్ స్టేడియంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్‌లో సోమవారం రాత్రి రుషి అనే బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీ మంగళవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. బాలుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగినట్లుగా భావిస్తున్నప్పటికీ, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. స్పోర్ట్స్ క్లబ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. రిషి బంధువులను ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పరామర్శించారు. అనంతరం స్పోర్ట్ క్లబ్‌ను సందర్శించారు. స్విమ్మింగ్‌పూల్‌లో దిగి లోతును పరిశీలించారు. ఈ ఘటనపై పోర్ట్ చైర్మన్, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌ను మూసివేయాలని కోరారు.