
ఈకోర్సా అంతర విభాగాల క్రీడా మేళా ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: వాల్తేర్ డివిజన్ అంతర విభాగాల క్రీడా మేళాను రైల్వే క్రికెట్ స్టేడియంలో డీఆర్‌ఎం లలిత్ బోహ్రా మంగళవారం క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ధ్యాన్‌చంద్ అవార్డీ ఎన్.ఉషతో సహా అంతర్జాతీయ క్రీడాకారులు జ్యోతిని వెలిగించి డీఆర్‌ఎంకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తిపరమైన పనితో పాటు క్రీడాస్ఫూర్తి మేళవింపుగా ఉత్సాహాన్ని నింపేందుకే నెల రోజుల పాటు ఈ క్రీడామేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌ఎం సతీమణి లలిత్‌బోహ్రా, ఏడీఆర్‌ఎంలు మనోజ్‌కుమార్, ఇ.శాంతారామ్, క్రీడాధికారి ప్రవీణ్‌బాటి, సంయుక్త క్రీడాధికారి అవినాష్, బ్రాంచ్ అధికారులు, కార్యనిర్వాహక సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్తేర్ తూర్పు కోస్తా రైల్వే స్పోర్ట్స్ సంఘం(ఈకోర్సా) ఆధ్వర్యంలో 13 విభాగాల ఉద్యోగుల జట్లు మెన్, వుమెన్ కేటగిరీల్లో పోటీపడనున్నాయి. ఆర్పీఎఫ్–కమర్షియల్ విభాగాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ను డీఆర్‌ఎం టాస్ వేసి ప్రారంభించారు. ఈ మ్యాచ్‌లో కమర్షియల్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించగా, మరో మ్యాచ్‌లో ఎలక్ట్రికల్ ఈఎల్‌ఎస్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ జట్టుపై గెలుపొందింది. మహిళల క్యారమ్స్ పోటీల్లో ఈఎల్‌ఎస్, ఈఎల్‌ఈ(జనరల్) జట్లు ఎ–పూల్‌లోనూ, డీఎల్‌ఎస్, స్టోర్స్, అకౌంట్స్, ఆపరేషన్స్ జట్లు బి–పూల్‌లోనూ తొలిరోజు పోటీల్లో విజయం సాధించాయి.