
పచ్చ డ్యూటీ!
● పోలీసుల ఎదుటే దాడులకు తెగబడుతున్న టీడీపీ నేతలు ● గాజువాక పోలీస్‌స్టేషన్‌లోనే ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టిన తెలుగు మహిళా అధ్యక్షురాలు ● అయినా కేసు పెట్టకుండా తటపటాయించిన అధికారులు ● వీడియో వైరల్ అవడంతో సీపీ ఆదేశాలతో చివరికి కేసు నమోదు ● అన్ని పోలీస్ స్టేషన్లలో ఇదే తంతు
చీర కట్టులో విద్యార్థినుల సందడి
పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎవరిని చెప్పుతో కొట్టినా
కేసు పెట్టరు.. ఆస్పత్రిలో బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడినా పట్టించుకోరు..
ఓ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ మహిళ విగత జీవిగా
పడి ఉన్నా.. అబ్బే అలాంటిదేమీ లేదని
బుకాయించేస్తారు.. కూటమి పార్టీతో చేతుల కలపలేదని ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్
ఇంటికి వెళ్లి మహిళలు, పిల్లలపై
బెదిరింపులకు దిగుతారు.
ఇదీ విశాఖ
పోలీసుల పనితీరు.
విశాఖ సిటీ: నగరంలో కొందరు సీఐలు, ఏసీపీలు పచ్చ రంగు పులుముకుని విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికార మదంతో కూటమి నేతలు పోలీసుల కళ్ల ముందే ఎన్ని అకృత్యాలు చేసినా వీరికి కనిపించవు. వినిపించవు. బాధితులు స్టేషన్ల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా.. సీఐ, ఏసీపీలను కలిసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి దృష్టికి వెళ్లలేనంత వరకు ఎటువంటి కేసులు నమోదు కావు. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వారి సేవలో తరిస్తున్నారనడానికి ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం.
స్టేషన్‌లోనే చెప్పుతో కొట్టిన తెలుగు మహిళ
గాజువాక పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. స్టేషన్‌లో నరేంద్ర అనే వ్యక్తి ఎస్‌ఐ ముందు మాట్లాడుతున్న సమయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి లోపలకు వచ్చారు. వచ్చి రావడంతోనే కాలి చెప్పు తీసి నరేంద్ర ముఖంపై కొట్టారు. దీంతో నరేంద్రతో పాటు ఎస్‌ఐ కూడా నిర్ఘాంతపోయారు. ఆ తరువాత కూడా అతడి మీదకు వెళుతున్నా ఆమెను ఆపే సాహసం చేయలేకపోయారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. అయితే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డయిన ఆమె దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినప్పటికీ కేసు పెట్టకుండా ఈ వ్యవహారంలో రాజీ కుదర్చాలని చివరి వరకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. ఈ విషయం సీపీ శంఖబ్రత బాగ్చి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగు మహిళా అధ్యక్షురాలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఆ కేసు పెట్టే సమయంలో కూడా సదరు మహిళా నేత గాజువాక సీఐ పార్థసారధిపై చిందులు తొక్కారు. స్టేషన్ నుంచి బదిలీ చేయిస్తానని శపథం చేశారు. అయినప్పటికీ పోలీసులు మారు మాటలేకుండా ఆమెకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేస్తే నో కేస్
ఆరేడేళ్ల క్రితం వైఎస్సార్ సీపీ నాయకులు, సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న కారణంతో అరెస్టులు చేస్తున్న పోలీసులు.. ఇప్పుడు కూటమి నేతల దాష్టీకాలను మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తుండడం గమనార్హం. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్.. టీడీపీ నేతల అసభ్య పోస్టులపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం వీరి పనితనానికి నిదర్శనం. అదే టీడీపీ నుంచి ఒక వార్డు స్థాయి నాయకుడు గానీ, అభిమాని గానీ ఫిర్యాదు చేస్తే మాత్రం క్షణాల్లోనే అరెస్టులు, రిమాండ్‌లు జరిగిపోతున్నాయి.
టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు సీపీ చెబితేనే కేసులు.. లేకుంటే రాజీలు.. వినకపోతే బెదిరింపులు
పచ్చరంగు పులుముకుని..
విశాఖ పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతలు, అభిమానులపై ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కూటమి నేతలకు పూర్తిగా సాగిలా పడుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి నేతలు చేస్తున్న కుటిల ప్రయత్నాలకు పోలీసులు శాయశక్తుల సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొందరు సీఐలు మితిమీరి ప్రవర్తిస్తున్న విషయం ఇటీవల దుమారం రేపింది. మేయర్ సీటుకు అవసరమయ్యే బలం లేకపోవడంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు వల వేసి తాయిళాల ఎరచూపి కొంత మందిని లాక్కుంది. అయినప్పటికీ పూర్తిస్థాయి బలం లేకపోవడంతో మిగిలిన వారిని తమ వైపునకు తిప్పుకోవడానికి ఖాకీ అస్త్రాన్ని ప్రయోగించింది. కూటమి నేతల ఆదేశాల మేరకు ఒక సీఐ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్ ఇంటికి వెళ్లి అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కార్పొరేటర్ ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే.. ఇంట్లో ఉన్న మహిళలను, పిల్లలను స్టేషన్‌కు తీసుకువెళ్లాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు వెనక్కి తగ్గారు.
కేసులు మాయం..!
విశాఖలో వరుస హత్యలు, మహిళలపై అఘాయిత్యాలు గుబులు పుట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే నగరంలో క్రైమ్ రేట్ గణనీయంగా పెరిగిపోయింది. వరుస ఘటనలు కూటమి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేర నియంత్రణకు చర్యలు చేపట్టలేని ప్రభుత్వం.. కేసులను గోప్యంగా ఉంచాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే విశాఖలో జరుగుతున్న హత్యలు, మహిళలపై అఘాయిత్యాలను పోలీసులు గోప్యంగా ఉంచడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. భీమిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏఎన్‌హెచ్‌లో బాలికపై వార్డు బాయ్ అఘాయిత్య ప్రయత్నం చేశాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉంచేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. అలాగే ఓ హోటల్‌లో ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి కేసును మాయం చేయడానికి చివరి వరకు ప్రయత్నించారు. మూడు రోజుల తరువాత ఈ విషయం బయటకు పొక్కడంతో అది ఆత్మహత్యగా కేసు నమోదు చేశారు. ఇలా నగరంలో హత్యల నుంచి చోరీల వరకు అన్ని కేసులను గోప్యంగా ఉంచడానికి అపసోపాలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు.