
శేష వాహనంపై అప్పన్న తిరువీధి
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు బుధవారం స్వామికి శేషవాహనంపై తిరువీధి నిర్వహించారు. స్వామివారి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను విశేషంగా అలంకరించి శేషవవాహనంపై కొలువుంచారు. సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహిళల కోలాటం ఆకట్టుకుంది.
నేడు వైదిక సదస్యం, పండిత సదస్సు
కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.30 నుంచి వైదిక సదస్యం, మధ్యాహ్నం 3 నుంచి పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 నుంచి సర్వజన మనోరంజని వాహనంపై స్వామికి తిరువీధి నిర్వహిస్తారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ తెలిపారు.