
రైతుబజార్లకు కుళ్లిన టమాటా
● ‘చిత్తూరు’ టమాటాను అంటగడుతున్న అధికారులు ● వాటిని కొనేందుకు ఇష్టపడని వినియోగదారులు ● చేతి డబ్బులు కట్టాల్సి వస్తోందని స్టాళ్ల నిర్వాహకుల ఆవేదన
విశాఖ విద్య: జిల్లాలోని రైతు బజార్లలో వ్యాపారాలు నిర్వహిస్తున్న రైతులకు, స్టాళ్ల నిర్వాహకులకు టమాటా విక్రయాలు భారంగా మారుతున్నాయి. చిత్తూరు నుంచి వచ్చిన టమాటాలు రైతు బజార్లకు చేరేటప్పటికే కుళ్లి కంపుకొడుతున్నాయి. ఈ కుళ్లిన టమాటాలు అమ్ముడయ్యే పరిస్థితి లేక, చేతి డబ్బులు కట్టాల్సి వస్తోందని స్టాళ్లు నిర్వహిస్తున్న రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు వచ్చిన టమాటా మొత్తం విక్రయించాల్సిందేనని మార్కెటింగ్ శాఖ అధికారులు టార్గెట్లు పెడుతున్నారు. ఒక్కో స్టాల్‌లో రోజుకు రెండు లేదా మూడు క్రేట్‌ల టమాటాలను విక్రయించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో రోజంతా సరకులు విక్రయించగా వచ్చే లాభాన్ని టమాటా అమ్మకాల రూపంలో తిరిగి ప్రభుత్వమే దోచుకుంటోందని రైతులు వాపోతున్నారు.
రైతులపైనే రవాణా భారం
చిత్తూరు మార్కెట్ నుంచి టమాటాను లారీ ద్వారా జిల్లాకు తెచ్చి, నగరంలోని మర్రిపాలెం రైతుబజారు వద్ద వదిలేస్తున్నారు. ఇక్కడ నుంచి జిల్లాలోని 13 రైతు బజార్లకు మార్కెటింగ్ శాఖ అధికారులు టమాటాను సరఫరా చేస్తున్నారు. అయితే రవాణా చార్జీల రూపంలో ఒక్కో క్రేట్‌కు రైతుల నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. కుళ్లిన టమాటాతో నష్టపోతున్న తమకు రవాణా భారం వేయడమేంటని స్టాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే కార్డు తొలగిస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
క్రేట్లలోని టమాటా మాయం?
టమాటా నిల్వ చేసే క్రేట్ బరువు(సుమారు కిలో)తో కలిపి 26 కేజీల టమాటాగా మార్కెటింగ్ శాఖాధికారులు లెక్క చెబుతున్నారు. దీని ప్రకారమే ఏ రోజుకారోజు నిర్ణయించిన ధర మొత్తాన్ని రైతులు చెల్లించాలి. అయితే ఆ క్రేట్‌లో వస్తున్న వాస్తవ టమాటా బరువెంతనే తూకం వేసే పరిస్థితి లేదు. లారీలో నుంచి నేరుగా ఆటో/మినీ వ్యాన్ల ద్వారా రైతు బజార్లకు తెచ్చి, కళాసీల సాయంతో స్టాళ్లకు చేరవేస్తారు. ఇలావచ్చే ఒక్కో క్రేట్‌లో రెండు కిలోల వరకు టమాటా మాయమవుతోందని రైతులు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు క్రేట్‌లో మూడు నుంచి నాలుగు కేజీలు పాడైన టమాటాలు ఉంటున్నాయి. ఈ పరిణామాలు తమకు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని వాపోతున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తే, టమాటా మాయం వెనుక సూత్రధారులు ఎవరనేది తేటతెల్లమవుతుందని రైతులు చెప్తున్నారు.
కుళ్లిన టమాటా ఏం చేసుకుంటాం!
రైతు బజారులో సరసమైన ధరలకు నాణ్యమైన సరకులు విక్రయిస్తున్నట్లు కూటమి పెద్దలు చెబుతున్నారు. విశాఖలోని రైతుబజార్లలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. చిత్తూరు టమాటా అంటగడుతుండటంతో జిల్లాకు చెందిన రైతులు తమ పంటను రైతుబజారుకు తీసుకురాకుండా, బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో రైతు బజార్లలో కుళ్లిన టమాటాను వినియోగదారులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. రేటు తక్కువన్న మాటేకానీ, కుళ్లిన వాటిని ఇంటికి తీసుకెళ్లి ఏంచేసుకోవాలని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రైతుబజార్లకు కుళ్లిన టమాటా