
రహదారిపై కూలిన భారీ వృక్షం
ఏయూక్యాంపస్: నిత్యం రద్దీగా ఉండే ఆ రహదారిలో రెప్పపాటు కాలంలో ఓ భారీ వృక్షం కూలింది. పక్కనే పలు ద్విచక్ర వాహనాలు పార్క్‌చేసి ఉన్నాయి. అదృష్టం కొద్దీ ఆ సమయంలో ప్రయాణికులు ఎవ్వరూ రోడ్డుపై లేకపోవడంతో భారీ నష్టం, ప్రమాదం తప్పింది. వివరాలిలా.. వాతావరణ కేంద్రం నుంచి సిరిపురం వెళ్లే ప్రధాన రహదారిలో ఏయూ దూరవిద్య కేంద్రం దాటాక జీవీఎంసీ నీటి సరఫరా ట్యాంక్ ఉంది. దీని గేట్ వద్ద ఉన్న ఒక భారీ వృక్షం బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా గాలికి కూలిపోయింది. చిన్నపాటి గాలికే వృక్షం వేళ్లతో సహా నేలకొరిగింది. భారీ శబ్ధంతో రోడ్డుపై కూలడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పొక్లెయిన్ సాయంతో కూలిన చెట్టును తొలగించారు. చెట్టు కూలే సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.