
విద్యుత్ రంగ ప్రైవేటీకరణ తగదు
డాబాగార్డెన్స్: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ఏపీఈపీడీసీఎల్ పరిధి ఐదు జిల్లాల కార్మికులతో విశాఖలో సదస్సు నిర్వహించనున్నట్లు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఆర్‌కేఎస్‌వీ కుమార్ తెలిపారు. డాబాగార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా జరగనున్న సదస్సు పోస్టర్‌ను జగదాంబ జంక్షన్ దరి సిటు కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ విద్యుత్ రంగంలో ప్రైవేట్, కాంట్రాక్ట్, పీస్‌రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీలో జరిగిన అన్యాయాన్ని సవరించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేపాడ సత్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్డ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సదస్సుకు విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్, కాంట్రాక్ట్ పీస్ రేట్ ఉద్యోగస్తులైన షిఫ్ట్ ఆపరేటర్లు, సెక్షన్ ఆపరేటర్లు, మీటర్ రీడర్లు, వాచ్‌మెన్లు, స్టోర్ హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.
ఎలకి్ట్రసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సదస్సు రేపు