
మహిళలపై అఘాయిత్యాలు నియంత్రించలేని అసమర్థురాలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌పై దూషణలు ఆపి పాలనపై దృష్టి పెడితే మంచిది
వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ నాగ మల్లీశ్వరి హితవు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర హోంమంత్రిగా వంగలపూడి అనిత విఫలమయ్యారని, ఉమ్మడి విశాఖలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు జరిగితే నియంత్రించలేని అసమర్థురాలిగా మిగిలిపోయారని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ నాగ మల్లీశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేను చెబుతున్న మాట కాదు.. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పిన మాట అని గుర్తు చేశారు. హోంమంత్రిగా ఒక దళిత ఐపీఎస్‌ను వేధిస్తున్న పరిస్థితులు చూస్తున్నామన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
మంత్రి అనిత రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించకుండా.. తమ నాయకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో 16,800 మంది మహిళలపై అఘాయి త్యాలు, లైంగిక వేధింపులు జరిగినట్లు అనిత శాసనసభలో చెప్పారని, అంటే సగటున గంటకు ముగ్గురిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వరసగా మహిళలపై లైంగిక దాడులు, హత్యలు జరుగుతుంటే.. కనీసం బాధితులను పరామర్శించే పరిస్థితులు లేవన్నారు.
రాష్ట్రంలో బాధిత మహిళలను పరామర్శించి ధైర్యం చెప్పలేని ఫెయిల్యూర్ హోంమంత్రి అనిత అని, ఆమె షాపింగ్‌మాల్స్ ప్రారంభోత్సవాలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను శక్తి యాప్‌గా పేరు మార్చి.. ఏదో సాధించినట్టు గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా రాష్ట్రంలో శాంతిభద్రలపై దృష్టి సారించాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వ 10 నెలల పాలనలో కార్మికులు, కూలీలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు న్యాయం కోసం రోడ్డెక్కుతున్నారని, ముందు వారి సమస్యలను పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు.