
సింహగిరిపై ఘనంగా పండిత సదస్సు
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా నాల్గవరోజు గురువారం పండిత సదస్సు ఘనంగా జరిగింది. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేణుగోపాలస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా కల్యాణమండపంలో వేదికపై కొలువుంచారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. అనంతరం రాష్ట్రంలోని పలు దేవస్థానాల నుంచి వచ్చిన సుమారు 120 మంది వేద పండితులు తమ పాండిత్యంతో స్వామిని కీర్తించారు. నాలుగు వేదాల్లోని స్లోకాలతో స్వామిని కొలిచారు. స్వామి వైభవాన్ని వివరించారు. అనంతరం దేవస్థానం తరఫున పండితులను సత్కరించారు. వేద పండితులు శ్యావాస మహర్షి ఘనాపాటి(విజయవాడ దేవస్థానం) పృధ్వి ఘనాపాటి(శ్రీశైలం), అన్నపూర్ణయ్య ఘనాపాటి(కాణిపాకం), యనమండ్ర సూర్యనారాయణ ఘనాపాటి(అన్నవరం), వెంకటేశ్వర ఘనాపాటి(కనకమహాలక్ష్మి దేవస్థానం), సింహాచలం దేవస్థానం వేదపండితులు సురేష్ ఘనాపాటి, జగన్‌మోహన్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉదయం 7.30 నుంచి కల్యాణ ఉత్సవమూర్తుల చెంతన వైదిక సదస్యాన్ని నిర్వహించారు. సూపరింటెండెంట్లు జీవీవీఎస్‌కే ప్రసాద్, త్రిమూర్తులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
స్వర్ణ కవచ ధారునిగా అప్పన్న
కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి స్వర్ణ కవచ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ప్రతి గురువారం మాత్రమే లభించే స్వర్ణ కవచ అలంకారాన్ని ఏటా వార్షిక కల్యాణోత్సవాల్లో పండిత సదస్యం రోజు కూడా చేయడం పరిపాటి. ఈసారి గురువారం రోజే పండిత సదస్సు రావడం విశేషం.
అప్పన్న వైభవాన్ని కీర్తించిన
పలు దేవస్థానాల వేద పండితులు