
వాల్తేరు డివిజన్‌లో ఆదాయ వనరులపై సమీక్ష
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో రైల్వే బోర్డు అదనపు సభ్యులు(రెవెన్యూ) డాక్టర్ నవాల్ కె. శ్రీవాస్తవ గురువారం పర్యటించారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. నాన్‌ఫేర్ రెవెన్యూ ద్వారా నెలకొల్పిన వివిధ యూనిట్లను పరిశీలించారు. వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ స్టాల్‌ను సందర్శించారు. అనంతరం దొండపర్తిలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డీఆర్‌ఎం లలిత్ బోరా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులు, నాన్ ఫేర్ రెవెన్యూ సంబంధిత యూనిట్లు, రెవెన్యూ పెంపొందించే కార్యక్రమాల గురించి అధికారులు ఆయనకు వివరించారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఫైనాన్స్ సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్(ట్రాఫిక్) పి.రామచంద్రరావు, ఏడీఆర్‌ఎంలు మనోజ్‌కుమార్ సాహూ(ఆపరేషన్స్), ఈ.శాంతారాం(ఇన్‌ఫ్రా), ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.