
చందనోత్సవం విజయవంతానికి ప్రణాళిక
మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఈ నెల 30న జరగనుందని, ఈ వేడుకను సజావుగా, శోభాయమానంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. చందనోత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ విభాగాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, టికెట్ల విక్రయం నుంచి వాహనాల నిర్వహణ వరకు ప్రతీ అంశాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని సూచించారు. 29వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపివేయనున్నారని పేర్కొన్నారు. అందరికీ అనువైన ప్రాంతాల్లో రూ.1,000, రూ.300 టికెట్ల విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల రాకపోకలను నియంత్రించేందుకు పాసులు జారీ చేయాలని, కొండపైకి, దిగువన భక్తుల రవాణా కోసం తగిన సంఖ్యలో ఆర్టీసీ బస్సులు సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, మజ్జిగ కేంద్రాలు, వైద్య శిబిరాలు, మరుగుదొడ్లు విస్తృతంగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంట్రోల్ రూమ్, సైన్ బోర్డులు, శాశ్వత పోలీస్ అవుట్ పోస్ట్‌ల ఏర్పాటు, పార్కింగ్ సమస్య పరిష్కారానికి అదనపు స్థలాలు అభివృద్ధి తదితర చర్యలు చేపట్టాలన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ సింహగిరిపై, దిగువ ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ కోసం అదనపు స్థలాలు కేటాయించాలని సూచించారు. ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు, జేసీ మయూర్ అశోక్, డీఆర్వో భవానీశంకర్, డీసీపీ అనిత వేజెండ్ల, సింహాచలం ఈవో కె. సుబ్బారావు, రెవెన్యూ, వైద్య, రవాణా, ఆర్టీసీ, జీవీఎంసీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష