
ప్రభుత్వ ఇసుకకు డిమాండ్ కరువు
ధర ఎక్కువగా ఉండటమే కారణం
ఆరిలోవ: ముడసర్లోవ వద్ద ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్‌కు డిమాండ్ కరువైంది. ఈ స్టాక్ పాయింట్‌కు సమీపంలో ఆరిలోవ, పైనాపిల్‌కాలనీ, అడవివరం, ఎంవీపీకాలనీ, ఆదర్శనగర్, విశాలాక్షినగర్, రవీంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వందలకొద్ది భవన నిర్మాణాలు జరుగుతున్నా.. ఇసుక కొనుగోలు చేయడానికి ఇక్కడకు వినియోగదారులు రావడం లేదు. దీంతో నాలుగు నెలల కిందట తీసుకొచ్చిన ఇసుక ఇంకా మిగలే ఉంది. ప్రైవేట్ వ్యాపారులు బయట విక్రయించే ధర కంటే ఈ స్టాక్ పాయింట్‌లో టన్ను ఇసుక ధర ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.700కు విక్రయిస్తున్నారు. బయట టన్ను ఇసుక రూ.650కే లభిస్తోంది. దీంతో టన్ను వద్ద రూ.50 వ్యత్యాసం ఉండటంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దే వినియోగదారులు ఇసుక కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 2024 డిసెంబరు 12న ఇక్కడ ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్ ప్రారంభించింది. అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలో గార ఇసుక రీచ్ నుంచి లారీలతో ఇక్కడకు 3,480 టన్నుల ఇసుక తీసుకువచ్చి నిల్వ చేశారు. ఇప్పటికి నాలుగు నెలలు గడిచినా ఇంకా ఈ స్టాక్ పాయింట్‌లో 1,200 టన్నుల ఇసుక మిగిలి ఉంది. ఈ లెక్క ప్రకారం నెలకు 552 టన్నుల చొప్పున ఇసుక విక్రయాలు జరిగినట్లు లెక్క. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టాక్ పాయింట్‌లో రోజుకు 200 టన్నులకు పైగా ఇసుక విక్రయాలు జరిగేవి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇసుక కొనడానికి వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు.