
దోపిడీకి పాల్పడిన బాలుడి అరెస్ట్
● ర్యాపిడో డ్రైవర్‌పై దాడి ఘటన
ఉక్కునగరం: ర్యాపిడో డ్రైవర్‌పై దాడి చేసి దోపిడీకి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసినట్లు నగర క్రైం డీసీపీ కె.లతా మాధురి తెలిపారు. ఈ నెల 10న స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ రహదారిలో ర్యాపిడో డ్రైవర్‌పై మైనర్ దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. గాజువాక సౌత్ ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ కేసు వివరాలు వెల్లడించారు. పార్ట్‌టైం ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న కిశోర్ ఆ రోజు రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా శ్రీనగర్ పెట్రోల్ బంక్ వద్ద బాలుడు స్టీల్‌ప్లాంట్ లోపలికి రైడ్ మాట్లాడుకున్నాడు. స్టీల్‌ప్లాంట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శ్మశానం వద్ద బైక్ ఆపమని చెప్పి, ఆ బాలుడు కిశోర్‌పై దాడి చేసి ఫోన్ లాక్కున్నాడు. ఆ ఫోన్ ద్వారా ముగ్గురికి రూ.48,100 ఫోన్‌పే ద్వారా పంపాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదుతో క్రైం సిబ్బంది వెంటనే అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో పెదగంట్యాడ సమతా నగర్‌లోని సాయిబాబా గుడి దగ్గరలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించిన బాలుడి నుంచి రూ.48,100 నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై.. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో బాలుడు దోపిడీకి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. డెలివరీ బాయ్స్, ర్యాపిడో, ఓలా తదితర డ్రైవర్లు రా త్రి సమయాల్లో అపరిచితులను నమ్మి లిఫ్ట్ ఇవ్వొద్దని సూచించారు. ఈ సందర్భంగా బాలుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. అనంతరం అతన్ని జువనైల్ హోమ్‌కు తరలించినట్లు క్రైం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. సమావేశంలో ఏడీసీపీ క్రైం మోహనరావు, ఏసీపీ జోన్–2 క్రైం డి.లక్ష్మణరావు పాల్గొన్నారు.

దోపిడీకి పాల్పడిన బాలుడి అరెస్ట్