
రాజకీయ నాయకులే ప్రజలకు పెద్ద సమస్య
సీతమ్మధార: ఉత్తరాంధ్రలో రాజకీయ నాయకులే ప్రజలకు పెద్ద సమస్యగా మారారని, వారు తమ కులాలకే నాయకులుగా పనిచేసే పరిస్థితి నెలకొందని మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు ఆక్షేపించారు. బీఎస్పీ, బీసీ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ధ శుక్రవారం నిర్వహించిన బీసీ సమరభేరీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రెండు కుటుంబాల్లోని మహిళల గురించే చర్చలు జరుగుతున్నాయని, మిగిలిన వారు మహిళలు కాదా అని ప్రశ్నించారు. ప్రజల దృష్టిని వాళ్ల వైపే మళ్లిస్తున్నారన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం బీసీలు ఉన్నారని, అయినా కమ్మ నాయకుల మాటే ఉత్తరాంధ్రలో చెల్లుతుందని ఆరోపించారు. షేక్‌లకు అమ్మాయిలను అమ్ముతున్నట్లు అదానీకి విశాఖ స్టీల్ ప్లాంటును అమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కమ్మరాజు ఎంపీ భరత్ దీని గురించి ఏమీ పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కాబట్టే ఆయన మాట చెల్లుబాటు కావడం లేదన్నారు. కామ్మ, రెడ్డిల ఉత్తరాంధ్ర అయిపోయిందని, కమ్మ వ్యక్తి శ్రీకాకుళంలో ఎమ్మెల్యే ఎట్లా అయ్యాడని ప్రశ్నించారు. రాష్ట్రంలో 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు, 32 మంది రెడ్డిలు ఉన్నట్లు పేర్కొన్నారు. పార్లమెంటులో వక్ఫ్ బిల్ వచ్చిన తర్వాత చర్చ కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి పి.శివప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి.విశ్వనాఽథ్, ఉపాధ్యక్షుడు ధనుంజయ్, జిల్లా కోశాధికారి రామచంద్రరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెద్దాడ కనకమహాలక్ష్మి, శరత్, అన్నవరం చిన్నారావు, రమేష్, పలు ప్రజాసంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాజీ డీజీపీ పూర్ణ చంద్రరావు