
అప్పన్న ఉంగరం చోరీ
● నేడు స్వామి ఉంగరం కోసం వెతుకులాట ● సింహగిరిపై వైభవంగా మృగయోత్సవం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి సింహగిరి మాడ వీధిలో మృగయోత్సవం(దొంగలదోపు) కనులపండువగా జరిగింది. ఏడు రోజుల ఉత్సవాల్లో ఆరో రోజు రాత్రి నిర్వ హించిన ఈ వేడుక వెనుక ఓ కథ ఉంది. కల్యాణం తర్వాత స్వామివారు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి అటవీ మార్గంలో విహారానికి వెళ్తారు. భాగవతోత్తములకు నిత్యం ఆరాధన చేస్తూ.. ఆస్తినంతటినీ పొగొట్టుకున్న నీలుడు అనే పండితోత్తముడు తదియారాధన ఆగకూడదని దారి దోపిడీలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో స్వామి, అమ్మవార్ల ఆభరణాలు దొంగిలిస్తాడు. చివరకు అమ్మవారి కాలిమెట్టును తీయడానికి ప్రయత్నించగా.. అది ఎంతకీ రాదు. ఈ క్రమంలో తాను దొంగలిస్తున్నది అమ్మవారి కాలిమెట్టని గ్రహించి.. మోక్షం పొందుతాడు. తన తప్పు తెలుసుకుని ఆభరణాలు తిరిగి ఇచ్చేస్తాడు. నీలుడి భక్తిని మెచ్చిన స్వామి తన సన్నిధిలో తిరుమంగై ఆళ్వార్‌గా స్థానం కల్పిస్తాడు. విహార యాత్ర ముగించుకుని స్వామి ఆలయానికి చేరుకోగానే ఆయన ఉంగరం కనపడకపోవడంతో అమ్మవారు లోపలికి రానివ్వదు. దీంతో ఉంగరం వెతుక్కునే వేటలో స్వామి పడతాడు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం ఉంటుంది. కల్యాణోత్సవాల్లో భాగంగా దారి దోపిడీ జరిగే ఘట్టాన్ని శనివారం రాత్రి విశేషంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా గోవిందరాజస్వామి అశ్వవాహనంపై, అమ్మవార్లు పల్లకీలో, తిరుమంగై ఆళ్వార్ మరొక పల్లకీలో మాడ వీధిలో ఊరేగారు. అర్చకులు నీలుడుగా, స్వామివారి దూతగా వేషధారణ చేసి దారి దోపిడీ ఘట్టాన్ని రక్తికట్టించారు. ఆదివారం ఉదయం స్వామి ఉంగరం వెతికే ఘట్టమైన వినోదోత్సవం జరగనుంది.

అప్పన్న ఉంగరం చోరీ