
రాజ్యాంగ పరిరక్షణకు కలిసి పోరాడాలి
డాబాగార్డెన్స్: రాజ్యాంగ పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి పిలుపునిచ్చారు. ప్రజానాట్య మండలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం పేరిట కళారూపాల శంఖారావం జరిగింది. బి.ఆర్.అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ర్యాలీని ఆర్.నారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా నలుమూలల నుంచి డప్పులు, తీన్మార్, కోలాటాలు, నృత్యాలు, నాటికలు వేసే కళాకారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డాబాగార్డెన్స్ లోని అల్లూరి విజ్ఞాన భవన్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో నారాయణమూర్తితో పాటు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, ఆండ్రా మాల్యాద్రి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అరుణ్, వై.రాజు అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దళితులు, మైనార్టీలపై దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కుతోందన్నారు. కార్మిక చట్టాలను మార్చి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. నారాయణమూర్తి మాట్లాడుతూ దేశంలోని కార్మికులు, పీడితులు, దళిత బడుగు బలహీన వర్గాల కోసం పోరాడేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆండ్రా మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కోసం కేవీపీఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. థింసా నృత్యం, రాజ్యాంగ పరిరక్షణకు నాటిక, బాలబాలికల నృత్య ప్రదర్శనలు, మహిళల కోలాటాలు అలరించాయి. అంబేడ్కర్ వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో జి.రమణ, టి.చిరంజీవి, ఎం.చంటి, సుబ్బన్న, వై.రాజు, కె.సత్యనారాయణ, జి.స్టాలిన్, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పిలుపు