
పేలుడు ఘటన దురదృష్టకరం : హోంమంత్రి
ఎంవీపీకాలనీ : కైలాసపట్నం బాణ సంచా తయారీ కేంద్రం పేలుడు ఘటన అత్యంత దురదృష్టకరమని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలై కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం రాత్రి ఆమె ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఘటనలో మృతి చెందిన వారంతా ఐదేళ్లుగా ఆ బాణసంచా కేంద్రంలో పనిచేస్తున్నారన్నారు. 2026 వరకు ఆ కేంద్రా నికి లైసెన్స్ ఉందన్నారు. బాంబుల తయారీకి వినియోగించే పేలుడు పదార్థం చేజారడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే విషయం ప్రాథమిక విచారణ లో తేలిందన్నారు. లోపల ఉన్న 16 మందిలో 8 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో ఐదుగురికి కేజీహెచ్‌లో, ముగ్గురికి నర్సీపట్నం ప్రభుత్వాస్పపత్రిలో వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. మృతులకు ప్రభుత్వం తరపున రూ.15 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించినట్లు తెలిపారు. మరో రూ.2 లక్షలు కేంద్రం నుంచి కూడా మంజూరవుతుందన్నారు. క్షతగాత్రులకు రూ.4 లక్షలు ఆర్థికసాయం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.