
అప్పన్నకు శ్రీ పుష్పయాగం
● ముగిసిన వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం: సింహగిరిపై గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం నుంచి స్వామికి శ్రీ పుష్పయాగాన్ని నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవి అమ్మవార్లకు పూల అలంకరణ చేసి ఆలయ కల్యాణమండపంలో శేషతల్పంపై ఆళ్వారులతో సహా వేంజేపచేసి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. ద్వాదశి ఆరాధనలు, పలు రకాల పుష్పాలతో పుష్పాంజలి సేవ చేశారు. అనంతరం భోగమండపంలో ఉంజల్‌సేవ ఘనంగా నిర్వహించారు.
చందనోత్సవంసీఎఫ్‌వోగా మూర్తి
సీఎఫ్‌వోగా తప్పుకున్న భ్రమరాంబ
సింహాచలం : ఈనెల 30న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి రాష్ట్ర దేవదాయశాఖ తరపున చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా ఆ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్, ద్వారకా తిరుమల దేవస్థానం ఈవో ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తిని దేవదాయశాఖ నియమించింది. కాగా చందనోత్సవం సీఎఫ్‌వోగా ఆ శాఖ అమరావతిలోని ప్రధాన కార్యాలయంలో ఆర్‌జేసీగా విధులు నిర్వర్తిస్తున్న డి.భ్రమరాంబని తొలుత నియమించారు. ఆమె ఇటీవల సింహగిరికి వచ్చి దేవస్థానం ఈవో, ఇంజనీరింగ్ అధికారులు, సెక్షన్ హెడ్‌లతో చందనోత్సవం నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో వ్యక్తిగత కారణాలు ఉన్నాయంటూ సీఎఫ్‌వో బాధ్యతలు తప్పించాలని దేవదాయశాఖకి ఆమె విన్నవించుకున్నారు. దీంతో మూర్తిని సీఎఫ్‌వోగా నియమిస్తూ ఆ శాఖ ఇన్‌చార్జి కమిషన్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీచేశారు.