వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం.. | - | Sakshi
Sakshi News home page

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..

Apr 15 2025 1:21 AM | Updated on Apr 15 2025 1:21 AM

వెళ్ల

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..

ఏయూక్యాంపస్‌ : విశాఖ సాగర తీరం.. అద్భుతమైన జీవవైవిధ్య ఘట్టానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి పుడమి తల్లి ఒడిలోనే అరుదైన ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు జీవం పోసుకుని, ఆపై సముద్రంలో జీవనాన్ని కొనసాగిస్తాయి. వేల మైళ్లు ప్రయాణించి.. తిరిగి తాము పుట్టిన గడ్డకే వస్తాయి. తమ తర్వాతి తరానికి జీవం పోస్తాయి. మళ్లీ అనంత సాగరంలోకి సాగిపోయే ఆలివ్‌ రిడ్లే తాబేళ్ల ప్రస్థానం ప్రకృతిలోని ఓ అద్భుతం. అయితే ఈ ప్రయాణం పూలపాన్పు కాదు. గుడ్డు దశ నుంచి సముద్రంలో జీవనం సాగించే వరకు ప్రతి అడుగులోనూ వాటికి సవాళ్లు ఎదురవుతాయి. కాగా.. ఈ ఏడాది వందలాది తాబేళ్లు విశాఖ తీరంలో గుడ్లు పెడుతుండగా.. అటవీ శాఖ వాటిని సేకరించి సంరక్షిస్తోంది. పొదిగిన పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేస్తోంది.

సాగరంలోకి పయనం

ఆలివ్‌ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లు పొదగడానికి 45 రోజుల పడుతుంది. ఈ కీలకమైన సమయంలో వాటి సంరక్షణ చాలా ముఖ్యం. తీర ప్రాంతాల్లో సంచరించే కుక్కల నుంచి ఈ గుడ్లకు ముప్పు ఉంటుంది. ఈ సమయంలో అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. గుడ్లు పెట్టే కాలంలో, అటవీశాఖ సిబ్బంది ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు తీరం వెంబడి గస్తీ నిర్వహిస్తారు. వారు తాబేళ్లు గుడ్లు పెట్టిన ప్రదేశాలను గుర్తించి, వెంటనే ఆ గుడ్లను సేకరిస్తారు. అనంతరం, వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు. అక్కడ దాదాపు అడుగున్నర లోతులో గుడ్లను పాతిపెట్టి, చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తారు. కుక్కలు, ఇతర జంతువులు, మనుషుల నుంచి రక్షణ కల్పిస్తారు. సుమారు 45 రోజుల తర్వాత ఈ గుడ్ల నుంచి చిట్టి తాబేళ్లు బయటకు వస్తాయి. ఇలా వచ్చిన వందలాది తాబేలు పిల్లలను అటవీశాఖ సిబ్బంది ప్రతి రోజూ ఎంతో జాగ్రత్తగా సముద్రంలోకి వదులుతున్నారు. ఇటీవల పాండురంగాపురం వద్ద బీచ్‌లో 170 తాబేలు పిల్లలను ఇలాగే సముద్రంలోకి విడిచిపెట్టారు.

జీవితం ఓ పోరాటం

గుడ్డు దశలో ఉన్న ముప్పు తొలగిపోయినా.. సముద్రంలోకి చేరిన తర్వాత కూడా ఈ తాబేలు పిల్లల జీవనం సవాళ్లతో కూడుకున్నదే. ఆహారం సంపాదించుకోవడం, ఇతర సముద్ర జీవుల నుంచి తమను తాము రక్షించుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. పుట్టిన వాటిలో చాలా తక్కువ సంఖ్య మాత్రమే అన్ని అడ్డంకులను అధిగమించి పెద్దవై.. మళ్లీ గుడ్లు పెట్టడానికి ఎక్కడ పుట్టాయో అక్కడి తీరానికి తిరిగి వస్తాయి. పెద్దయ్యాక కూడా.. తీరానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు మత్స్యకారుల వలలకు చిక్కి, పడవలకు తగిలి కొన్ని తాబేళ్లు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి.. తాబేళ్లు వలల్లో చిక్కుకున్నా సురక్షితంగా బయటపడేలా సెంట్రల్‌ మైరెన్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) ప్రత్యేకమైన వలలను రూపొందించింది. వీటి వినియోగం పూర్తిస్థాయిలో అమలైతే.. ఈ అరుదైన జీవుల సంరక్షణ పూర్తిస్థాయిలో సాధ్యపడుతుంది.

పుడమి నుంచి

కడలిలోకి

ఆలివ్‌ రిడ్లే పిల్లలు

రాత్రి వేళ రహస్యంగా..

ఆలివ్‌ రిడ్లే జాతికి చెందిన సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్య తీరానికి చేరుకుంటాయి. తమ ముందు, వెనుక కాళ్లను ఉపయోగించి ఇసుకలో గుంతలు తవ్వి.. అందులో గుడ్లు పెడతాయి. ఒక్కో ఆడ తాబేలు సుమారు 60 నుంచి 120 గుడ్ల వరకు పెట్టి.. ఆ గుంతలను ఇసుకతో పూడ్చేస్తాయి. ఆ తర్వాత సూర్యోదయం కాకముందే అవి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ తాబేళ్లు చంద్రుడి కదలికను అనుసరించి సముద్ర తీరానికి వస్తాయి. సూర్యోదయం కాకముందే ఎవరి కంటా పడకుండా తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి.

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం.. 1
1/3

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం.. 2
2/3

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం.. 3
3/3

వెళ్లొస్తాం.. పెరిగి మళ్లొస్తాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement