
అవిశ్వాసం వేళ అరాచకాలకు తెర
డాబాగార్డెన్స్: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు కూటమి నేతలు తెర వెనుక అప్రజాస్వామిక ప్రయత్నాలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మాన సమావేశం దగ్గర పడడంతో మరింత బరితెగిస్తున్నారు. అవసరమైన సంఖ్యా బలాన్ని కూడగట్టేందుకు కుట్రలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు కోట్లాది రూపాయలు మంచినీరులా వెచ్చిస్తున్నారు. ఒక్కో కార్పొరేటర్‌కు ఏకంగా రూ.25 లక్షలు ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. కొందరికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తూ.. మరికొందరి వ్యాపారాలు అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. లొంగని వారి ఆస్తులు ధ్వంసం చేస్తామని బహిరంగంగానే హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలోనూ ఇదే తరహా అప్రజాస్వామిక విధానాలు అవలంబించి స్థానిక సంస్థలను చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం..ఇప్పుడు విశాఖ నగర పీఠాన్ని కూడా తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చేస్తున్న కుట్రలు తారాస్థాయికి చేరాయి.
భయభ్రాంతులకు గురి చేసి..
మేయర్ పీఠం కోసం నెల రోజులుగా టీడీపీ, జనసేన నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. కేవలం 11 నెలలు ఉన్న పదవీ కాలాన్ని చేజిక్కించుకోవడానికి ఫ్యాన్ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకున్నారు. ముఖ్యంగా విశాఖ మేయర్ పీఠంపై యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళ కూర్చోవడాన్ని జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున కుట్రలకు తెరతీశారు.
అవిశ్వాసంపై వైఎస్సార్‌సీపీ ధీమా
జీవీఎంసీలో కూటమికి బలం లేకపోయినా, ప్రభుత్వ పెద్దలు కుతంత్రంతో విశాఖ మేయర్ పీఠాన్ని అడ్డదారిలో దక్కించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అవిశ్వాసంలో నెగ్గడం ఖాయమంటూ వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన 58 మంది సభ్యులకు విప్ జారీ చేసింది. పార్టీ విప్ ధిక్కరించి సమావేశానికి హాజరయ్యే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
నిస్సిగ్గు
మేయర్‌పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా నిస్సిగ్గుగా కార్పొరేటర్లు పార్టీలు మారడం దారుణం.. పార్టీ మారాలనుకునే వారు ముందుగా తమ పదవులకు రాజీనాయా చేయాలి. ఓ పార్టీ జెండాపై గెలిచి మరో పార్టీలో చేరడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా అంటూ నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా దమ్ము.. ధైర్యం ఉంటే.. తిరిగి ఎన్నికల్లో నిలబడి సత్తా ఏంటో నిరూపించుకోవాలని సూచిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లకు రూ.కోట్లు ఎర
లొంగకుంటే బేరాలు, బెదిరింపులు
విప్ జారీ చేస్తామని వైఎస్సార్‌సీపీ ప్రకటన
అంతా గమనిస్తున్న ప్రజలు
కార్పొరేటర్ల కొనుగోలు నీతి బాహ్యం..
11 నెలల పదవి కోసం కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వామపక్ష కార్పొరేటర్లు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. లక్షలాది రూపాయలిచ్చి కార్పొరేటర్లను కొనుగోలు చేయడం నీతి బాహ్యమైన చర్యగా పేర్కొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి దూరమని ఇప్పటికే ప్రకటించారు.