
చూస్తాం.. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..
డాబాగార్డెన్స్: కుట్రలు..కుతంత్రాలతో నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారిని కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ద్వారా దించేశారు. మరోవైపు మూడు నెలలుగా కమిషనర్‌ను నియమించలేని దుస్థితి. ఓ అదనపు కమిషనర్ డిప్యూటేషన్‌పై తిరుమల తిరుపతికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక బోసిపోయింది. మరో అదనపు కమిషనర్ కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో అర్జీలకు సమాధానం చెప్పే అధికారి కరువయ్యారు. కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ముఖ్యంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి సమస్యలు వెల్లువెత్తుతుంటాయి. ఆ సమస్యలు పరిష్కరించే అధికారులు (ఇద్దరు ఏసీపీలు తప్ప) లేకపోవడం గమనార్హం. ఎప్పటి మాదిరిగానే ఫిర్యాదులు స్వీకరించారు. చూస్తాం... సంబంధిత అధికారికి చెబుతాం అంటూ దిగువ స్థాయి సిబ్బంది అర్జీదారులకు సమాధానం చెప్పడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.
పరిష్కార వేదికకు 73 వినతులు
జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సోమవారం 73 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. జోన్ల వారీగా, ప్రధాన కార్యాలయానికి సంబంధించి వినతులు అందాయి. అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 47 ఫిర్యాదులు వచ్చాయి. ఇతర విభాగాలైన అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ, ప్రజారోగ్యం, ఇంజనీరింగ్, మొక్కల విభాగానికి కూడా ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో పలువురు జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
దిగువస్థాయి సిబ్బంది సమాధానంతో
అర్జీదారుల అసంతృప్తి
తూతూ మంత్రంగా జీవీఎంసీ పీజీఆర్‌ఎస్