
అందరికీ నచ్చేలా ‘సారంగపాణి జాతకం’
డాబాగార్డెన్స్: ‘సారంగపాణి జాతకం’లో తాను చేసిన పాత్ర, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని హీరో ప్రియదర్శి తెలిపారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ చిత్ర యూనిట్ గురువారం నగరంలో సందడి చేసింది. ఈ సందర్భంగా జగదాంబ సమీపంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడారు. తాను నటించిన మల్లేశం, బలగం, కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అన్నారు. ఇంద్రగంటితో ఒక ఫొటో దిగితే చాలనుకునే వాడినని.. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో ఆంధ్ర యాసలో డైలాగ్‌లు చెప్పినట్లు వివరించారు. హీరోయిన్ మాట్లాడుతూ అందర్నీ ఈ సినిమా ఆకట్టుకుంటుందన్నారు. ఆద్యంతం హాస్యంతో పాటు ప్రతీ సన్నివేశం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. దర్శకుడు ఇంద్రగంటి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. మంచి కథతో అందరూ ఇష్టపడే హాస్యంతో రూపొందించిన ఈ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.
హీరో ప్రియదర్శి