ఆపన్నహస్తం | - | Sakshi
Sakshi News home page

ఆపన్నహస్తం

Published Tue, Oct 31 2023 2:12 AM | Last Updated on Tue, Oct 31 2023 9:09 AM

- - Sakshi

జామి/లక్కవరపుకోట/శృంగవరపుకోట: విజయనగరం జిల్లా అలమండ రైల్వేస్టేషన్‌ సమీపంలో కంటకాపల్లి వద్ద ఆదివారం రాత్రి రెండు పాసింజర్‌ రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి బయల్దేరిన విశాఖ–పలాస పాసింజర్‌ రైలును అదే మార్గంలో కొద్ది నిమిషాల వ్యవధిలో బయల్దేరిన విశాఖ–రాయగడ పాసింజర్‌ రైలు వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఘటనపై స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలతో పాటు క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు ఆపన్నహస్తం అందిస్తున్నా యి. ఓ వైపు రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తూనూ... క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. విజయనగరం సర్వజన ఆస్పత్రికి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను సోమ వారం పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేవరకు మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.

రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ
భీమాళి–అలమండ రైల్వేస్టేషన్ల మధ్య జరిగిన రైలు ప్రమాదంలో మూడు రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నా యి. భారీ క్రేన్‌లు, ఏఆర్‌టీ, ఎంఆర్‌వీ వంటి యూనిట్‌లను తీసుకొచ్చి 20 గంటల్లో అప్‌–డౌన్‌ ట్రాక్‌లను రైల్వే సిబ్బంది పునరుద్ధరించారు. రైల్వే జీఎం మనోజ్‌శర్మ, డీఆర్‌ఎం సౌరవ్‌ప్రసాద్‌ పనులను పర్యవేక్షించారు. గూడ్స్‌, డొమెస్టిక్‌ ట్రైన్‌ల రాకపోకలు పునరుద్ధరించారు. సహాయక చర్యల్లో ఎస్‌డీర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్‌పీఎఫ్‌, ఓడీఆర్‌ఎఫ్‌, జీఆర్‌పీ, ఏపీ పోలీస్‌, ఏపీ ఫైర్‌, ఆరోగ్యశాఖ బృందాలు తమ సేవలు అందించాయి. ప్రత్యేక బృందాలు ప్రమాద కారణాలను అన్వేషించి, సాక్ష్యాలు సేకరించే పనిలో ఉన్నాయి.

శిరికిపాలెం వాసుల ఔదార్యం
ప్రమాదవార్త తెలిసిన వెంటనే గంట వ్యవధిలో శిరికిపాలెం గ్రామస్తులు స్పందించారు. సెల్‌ఫోన్లు, టార్చ్‌లైట్ల వెలుగులో క్షతగాత్రుల తరలింపు, చనిపోయిన వారి మృతదేహాలను వెలికి తీయడంలో వైద్య, పోలీస్‌ బృందాలకు సహకరించారు. సోమ వారం ఉదయం నుంచి ఘటనాస్థలి వద్దనే పొయ్యిలు ఏర్పాటు చేసి సహాయకులకు వంటలు చేసి వడ్డిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని టెలికామ్‌ సంస్థ ఎండీ రామ్మోహనరావు, ఇండస్‌ టవర్‌ విశాఖపట్నం రీజినల్‌ ఏఓ ఎం.సీతారాం తమ సిబ్బందితో వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నవారికి రూ.30వేలు విలువైన ఎనర్జీ డ్రింక్స్‌, వాటర్‌ బాటిళ్లు, శీతలపానీయాలు, బిస్కెట్లు అందజేశారు.

ఒడిశా రెవెన్యూ మంత్రి సుధామ్‌ మరిండి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఎస్‌.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రమాదస్థలిని పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదివార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకుని ఎల్‌.కోట, జామి మండలాల ప్రజాప్రతినిధులను, పార్టీ శ్రేణులను సహాయక చర్యలో నిమగ్నం చేశారు.

పైళ్లెన ఐదు నెలలకే...
విజయనగరం ఫోర్ట్‌: తోటపాలేంకు చెందిన చల్లా సతీష్‌ (29) విశాఖపట్నం సిరిపురంలోని ఓ జ్యూయలరీ దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ విజయనగరం నుంచి వెళ్లి వస్తున్నాడు. ఆదివారం ఎప్పటి మాదిరి విశాఖపట్నం వెళ్లి రైల్లో తిరిగి వస్తుండగా అలమండ రైల్వేస్టేషన్‌ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందాడు. అతనికి ఐదు నెలల కిందట వివాహం అయింది. కొడుకు మృతితో తల్లి రాజ్యలక్ష్మి రోధించిన తీరు కంటతడి పెట్టించింది.

కోలుకునేవరకు బాధితులకు చికిత్స

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి బొత్స

విజయనగరం అర్బన్‌: రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిందని, క్షతగాత్రులు కోలుకునేవరకు ఉచిత వైద్యసేవలు అందిస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రాస్పత్రిలో 29 మందికి వైద్య సేవలు అందుతున్నాయని, ఆరోగ్యం విషమంగా ఉన్న నలుగురుకు మెరుగైన వైద్యసేవలు అందజేయాలని వైద్యులకు సూచించామన్నారు. ఆరు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు వైద్యు లు అప్పగించారన్నారు. ఆయన వెంట డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్‌, ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఉన్నారు.

ఆశలు తీరకుండానే అనంతలోకాలకు...
కొత్తవలస: కొత్తవలస మండలం దెందేరు గ్రామానికి చెందిన చింతల కృష్ణంనాయుడు (34) విజయనగరంలోని రైల్వే శాఖలో గ్యాంగ్‌మన్‌గా పని చేస్తున్నాడు. దెందేరు నుంచి బైక్‌పై కొత్తవలస రైల్వేస్టేషన్‌కు చేరుకొని అక్కడ నుంచి రాయగడ పాసింజర్‌లో రోజూ రాకపోకలు సాగిస్తుంటాడు. ఆదివారం ఆ రైలు ప్రమాదానికి గురికావడంతో ప్రాణాలు కోల్పా యాడు. పైళ్లెన ఏడాదికే మృతి చెందడంతో భార్య చంద్రకళతో పాటు నెలల చిన్నారి అనాథలుగా మారారు.

గిరిజన బాలికకు తీవ్రగాయాలు
సీతంపేట: మండలంలోని పెద్దవంగరగూడ గ్రామానికి చెందిన సవర బుజ్జి రైలు ప్రమాదంలో గాయపడింది. విశాఖపట్నంలో నర్సింగ్‌ చదువుతున్న ఆమె తమ స్వగ్రామానికి విశాఖ–పలాస పాసింజర్‌లో వెళ్తుండగా ప్రమాదంలో చిక్కుకుంది.

కూలి బతుకుల్లో విషాదం
చీపురుపల్లి రూరల్‌(గరివిడి): భవన నిర్మాణపనికి వెళ్లి తిరిగివస్తున్నవారిని రైలు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. కూలి కుటుంబాల్లో విషాదం నింపింది. రైలు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికులైన చీపురుపల్లి పట్టణంలోని రెడ్డిపేటకు చెందిన రెడ్డి సీతంనాయుడు, గరివిడి మండలం గదబవలస గ్రామానికి చెందిన మజ్జి రాము, కాపుశంబాం గ్రామానికి చెందిన కరణం అప్పలనాయుడు, పిల్ల నాగరాజు మృతిచెందారు. సీతంనాయుడు మృతితో భార్య, ఇద్దరు పిల్లలు అనాథలయ్యా రు. అప్పలనాయుడు మృతితో భార్య, ఇద్దరు చిన్నారులు కన్నీటిసంద్రంలో మునిగిపోయా రు. నాగరాజు మృతితో భార్య, బాబు, మజ్జి రాము మృతితో భార్య ఈశ్వరి, కిరణ్‌, నవ్యశ్రీ అనాథులుగా మారారు. బాధిత కుటుంబాలను మంత్రి విద్యాశాఖమంత్రి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఓదార్చారు. అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. మృతదేహాలను విజయనగరం సర్వజన ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు చేర్చే ఏర్పాట్లు చేశారు.

ఏ దిక్కూలేక...
జామి: మండలంలోని గొడికొమ్ము గ్రామానికి చెందిన కంచుమార్కి రవి విద్యుత్‌ పనులు చేస్తూ భార్య కుమారి, ఇద్దరు కుమార్తెలు ప్రసన్న, హరితను పోషిస్తున్నారు. ఆదివారం ఉదయం పనికి వెళ్లే ముందు మటన్‌ తెచ్చి ఇంటికి ఇచ్చాడు. భర్త వస్తాడని ఎదురుచూసిన భార్య, నాన్న వస్తాడని ఎదురుచూసిన పిల్లలకు ఇకరాడని తెలియడంతో బోరున విలపిస్తున్నారు. ఇంటి పెద్దదిక్కును మృత్యువుకాటేయడంతో విషాదంలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement