సాక్షి ప్రతినిధి,విజయనగరం: సార్వత్రిక ఎన్నికలకు మరో తొమ్మిదినెలలు గడువు ఉండగానే రాజకీయం వేడెక్కుతోంది. రాష్ట్రంలో ఈ ధపా ఎన్నికల్లో 175ను టార్గెట్ చేస్తూ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా ప్రజల్లో ఉంచుతూ సకాలంలో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఆయన పాలనకు ఆకర్షితులై పలువురు రాజకీయ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు.
రాజాంలో కొత్త జోష్
రాజాం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఖాతాలో ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోండ్రు మురళీమోహన్ భారీ ఓట్ల తేడాతో కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. రెండేళ్లపాటు కోండ్రు నియోజకవర్గానికి ముఖంచాటేశారు. తాజాగా ఏడాదిన్నర కిందట నుంచి తిరుగుతున్న ఆయనకు రేగిడి, రాజాం, వంగర మండలాల్లో తమ పార్టీ ప్రధాన నేతల నుంచే వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రాజాంకు చెందిన టీడీపీ సీనియర్ నేత, రెండు పర్యాయాలు పాలకొండ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తలే భద్రయ్య, తన కుమారుడు డాక్టర్ రాజేష్ వైఎస్సార్ సీపీలో చేరారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వారి వెంట రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. దీంతో రాజాం నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరడం ఖాయమన్న విజయసంకేతం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
తండ్రి బాటలో తనయుడు
రాజాంలో ఎముకుల వైద్యునిగా తలే భద్రయ్య కుమారుడు డాక్టర్ తలే రాజేష్‌కు పేరుంది. రాజాంలో జీఎంఆర్ కేర్ ఆస్పత్రిలో ఆర్థోపెథిక్‌గా సేవలు అందించారు. ఆయన తన పదేళ్ల సర్వీసుల్లో పదివేలకు పైగా ఆపరేషన్లు చేసి రికార్డు సృష్టించారు. ఇటీవల సొంతంగా రాజాంలో సన్‌రైజ్ ఆస్పత్రిని ప్రారంభించారు. తలే రాజేష్‌ను టీడీపీ అధిష్టానం రాజాం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దించుతుందని ఊహించారు. రాజేష్ తీసుకున్న తాజా నిర్ణయంతో టీడీపీని ఆ కుటుంబం వ్యతిరేకిస్తున్నట్టు కార్యకర్తలకు అర్థమైంది. దీంతో టీడీపీ క్యాడర్ మొత్తం ఇప్పుడు డోలాయనంలో పడింది.
ముందే ఖాయమైన విజయం
తలే భద్రయ్యతో పాటు అతని కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరడంతో రాజాం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం ఖాయమైందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఫాలోయింగ్ ఉన్న నేత
తలే భద్రయ్య 1985–89తో పాటు 1994–99 మధ్యకాలంలో పాలకొండ (అప్పట్లో ఎస్సీ) నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు. 1999–2004 మధ్యకాలంలో ఏపీపీఎస్సీ మెంబర్‌గా కూడా సేవలందించారు. అనంతరం రాజాంలో స్థిరపడిన ఆయన నియోజకవర్గంలో అన్ని మండలాల్లోని టీడీపీ ప్రధాన నేతలతో పాటు ఇతర పార్టీ నేతలతో సన్నిహితంగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. రాజాం నియోజకవర్గంలో టీడీపీ అనగానే గుర్తుకొచ్చే నేత తలే భద్రయ్య. నియోజకవర్గాల విభజన అనంతరం 2009 నుంచి ఇప్పటివరకూ టీడీపీలోనే ఉంటూ తన వంతు పార్టీ గెలుపునకు కృషి చేసేవారు. అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు ఇటు స్థానిక టీడీపీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు వరకూ పార్టీ పెద్దలతో మంచి అనుబంధం, నియోజకవర్గ ప్రజలతో సత్సంబధాలు ఉన్నాయి. ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ నుంచి ఆయన వైఎస్సార్ సీపీలో చేరడం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment