గరంగరంగా గొంప శిబిరం
టీడీపీ అధిష్టానం పిలిచినా విజయవాడ వెళ్లేందుకు గొంప కృష్ణ ససేమిరా..
నేడు టీడీపీ శ్రేణులతో సమావేశం
అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమంటున్న అనుచర వర్గం
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సమాలోచనలు
శృంగవరపుకోట: నమ్మించి మోసం చేసిన టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా తమ స్వరం వినిపించాలని... స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి అమీతుమీ తేల్చుకుందామని ఎస్.కోట టీడీపీ నాయకుడు గొంప కృష్ణ వర్గం భావిస్తోంది. ఎస్.కోట ఎమ్మెల్యే స్థానాన్ని మూడోసారి మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి కేటాయించడంతో గొంప శిబిరం గరంగరంగా ఉంది. అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న నియోజకవర్గ వ్యక్తిని టికెట్ ఇస్తామంటూ నమ్మించి.. పార్టీ కోసం పనిచేయించి, రూ.కోట్లు ఖర్చు చేయించి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు, లోకేశ్ తీరుపై గొంప అభిమానులు రగిలి పోతున్నారు. నమ్మించి వెన్నుపోటు పొడిచిన పార్టీకి, వ్యక్తులకు బుద్ధిచెబుదామని గొంప కృష్ణ ఎదుటే ఆయన అనుచరణలు కుండబద్దలు కొడుతున్నారు.
విజయవాడ వెళ్లని ‘గొంప’..
ఎమ్మెల్యే టికెట్టు కేటాయించిన వారు, కన్వీనర్లు, పార్టీ నాయకులతో విజయవాడలో శనివారం నిర్వ హించిన ఎన్నికల వ్యూహం వర్క్‌షాప్‌కు హాజరు కావాలని గొంప కృష్ణకు పార్టీ నుంచి వర్తమానం అందింది. ఎస్.కోట స్థానాన్ని లలితకుమారికి కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన విజయవాడ సమావేశానికి హాజరు కాలేదు.
నేడు అనుచర వర్గంతో సమావేశం
ఎస్.కోట పట్టణంలోని తన కార్యాలయ ఆవరణలో ఆదివారం పార్టీ శ్రేణులు, అభిమానులతో సమావేశమయ్యేందుకు గొంప కృష్ణ ఏర్పాట్లు చేశారు. సమావేశంలో పార్టీ ఇచ్చిన హామీలు, చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్ నిర్ణయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే లలితకుమారి వైఖరిని విభేదించి వచ్చిన వారంతా ఎవరితో కలిసి పనిచేయాలి, టీడీపీలో చేరిన వారితో సయోధ్య సాధ్యమా అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. గొంప నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
బరిలో దిగేందుకే మొగ్గు..
పార్టీ చేసిన పనికి సరైన సమాధానం చెప్పాలని, ఎన్నికల బరిలో స్వతంత్య్ర అభ్యర్థిగా నిలబడి సత్తా చూపా లని పలువురు మండలస్థాయి నాయకులు గొంప కృష్ణకు సూచిస్తున్నారు. అన్ని అర్హతలు ఉండి, ఇప్పటికే నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో ఒక దశ ప్రచారం చేసి, పలు సేవా కార్యక్రమాలు చేసిన గొంప కృష్ణకే పార్టీ శ్రేణులతో పాటు ప్రజల మద్దతు ఉందని సలహా ఇస్తున్నారు. కోళ్ల లలితకుమారి కంటే అధిక ఓట్లు సాధించగలమని ధీమా వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment